గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.
కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అనంతరం కోర్టు నుంచి నేరుగా వెళ్లి వంశీని సత్యవర్ధన్ కలిశారు. ఈ క్రమంలో సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారించగా కేసు విత్ డ్రా చేసుకోవాలని తనను కిడ్నాప్ చేసి బెదిరించారని సత్యవర్థన్ తెలిపారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై విజయవాడ పటమట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Gjoy3VDXcAA9oZ9-1024x768.jpg)