నాటి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్‌ను వెంటనే తీసుకుపోవాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో లేఖ రాసింది. ఈ మేరకు జీఏడీ డిప్యూటీ సెక్రటరీకి లేఖ రాసిన వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆ ఫర్నీచర్‌ను వెంటనే తీసుకుపోవాలని కోరారు. ఈ విషయమై ఇప్పటికే నాలుగు పర్యాయాలు లేఖ రాశామన్న ఆయన.. తొలుత జూన్ 15, ఆ తర్వాత జూన్ 19, మళ్లీ జూలై 1, తిరిగి జూలై 29న లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. అంతే కాకుండా పార్టీ కార్యాలయ ఇంఛార్జ్ ఒకరు అనేక పర్యాయాలు ఈ విషయంపై జీఏడీని సంప్రదించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
అసలు ఆ ఫర్నీచర్‌ను వెనక్కు తీసుకునే ఉద్దేశం ఉందా? లేదా? అని లేళ్ల అప్పిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. కేవలం నిందలు మోపడానికే, దీనిపై స్పందించడం లేదా? అని ఆయన నిలదీశారు. ఫర్నీచర్‌ను తీసుకుపోవడం వీలు కాకపోతే, ఎక్కడికి పంపాలో జీఏడీ చెప్పాలన్న వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఒకవేళ ఆ ఫర్నీచర్‌ను వెనక్కు తీసుకోవడం ఇష్టం లేకపోతే, వాటి ఖరీదు చెబితే చెల్లిస్తామని స్పష్టం చేశారు.
ఈ ఫర్నీచర్ వల్ల తమ ఆఫీస్‌లో స్థలాభావం నెలకొందని, అందువల్ల ఏ విషయమూ వెంటనే చెప్పాలని వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఆ లేఖలో కోరారు.