ఏపీలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో సోమవారం జరగాల్సిన ఎన్నికను మంగళవారానికి అధికారులు వాయిదా వేశారు. కాసేపట్లో ఎన్నికకు ఓటింగ్ ఓరగాల్సి ఉండగా.. వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం(MLC Subramanyam) అదృశ్యమయ్యారు. అర్థరాత్రి నుంచి కనిపించడం లేదని.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉందని అనుచరులు వాపోతున్నారు. అయితే ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోకుండా తమ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కాగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో 50మంది కార్పొరేటర్లకు గాను 47మంది ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. మొత్తం 50 మంది సభ్యులకు గాను సోమవారం ఎమ్మెల్యే ఆరణితో కలిసి 22 మందే డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరయ్యారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లతో ఎంపీ గురుమూర్తి వెళ్తున్న బస్సుపై కూటమి నేతలు దాడి చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత అర్థరాత్రి టీడీపీ నేత ఇంటిపై వైసీపీ యువనేత అభినయ్ రెడ్డి దాడి చేశారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి డిప్యూటీ మేయర్ ఎన్నిక తిరుపతిలో కాక రేపుతోంది.