YS Jagan Fire on TDP: ఏపీలో భయానక వాతావరణం నెలకొందని.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారాయని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల గుడివాడలో బీసీ మహిళపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే బీసీ మహిళపై టీడీపీ సైకోలు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. బీసీల కోసమే పుట్టిన పార్టీ తమదంటూ గొప్పలు చెప్పుకునే నాయకుడు ఈ ఘటనతో ఎక్కడైనా దూకి చావాలంటూ ఘాటు విమర్శలు చేశారు.
ప్రతిపక్షంగా పోరాడే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తన పర్యటనలలోనూ పోలీసులు సహకరించడం లేదన్నారు. వైసీపీ కార్యకర్తలను చంపితే కుటుంబ సభ్యులను పరామర్శించొద్దా అని జగన్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ఏడాదిలో ప్రభుత్వం వైఫల్యాలపై వైసీపీ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ప్రజలకు అన్ని విధాలుగా తోడుగా నిలబడ్డామన్నారు. రైతులు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ భృతి, కరెంట్ చార్జీల వంటి సమస్యలపై పోరాడామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం విఫలమైందని.. మూడేళ్ల తర్వాత వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ప్రజలకు కూడా అర్థం అయిందని పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీల ద్వారా కేవలం ఏడాదిలో రూ.15వేల కోట్లు ప్రజలపై భారం మోపారంటూ దుయ్యబట్టారు.
Also Read: వైసీపీ పార్టీ గుర్తు మార్పుపై లేఖ అవాస్తవం..క్లారిటీ ఇచ్చిన శివకుమార్
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ ప్రజలకు భరోసాగా నిలిచిందన్నారు. అన్ని పార్టీల కార్యకర్తలకు స్పందన కార్యక్రమం ద్వారా న్యాయం చేశామన్నారు. ప్రస్తుతం మాట వినకపోతే పోలీసులపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ కారణాలతో డీజీ స్థాయి అధికారి అయిన పీఎస్సార్ ఆంజనేయులను జైలుకు పంపించారని తెలిపారు. అలాగే ఎస్పీ స్థాయిలో ఉన్న పలువురు అధికారులపై కూడా తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారని.. వందలాది మంది పోలీసులను వీఆర్‌కు పంపించారని విమర్శించారు. కొందరు పోలీసులు ప్రభుత్వం చెప్పే నీచపు పనులు చేయలేక రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారంటూ ఆగ్రహించారు.


