వైసీపీ మద్దతుదారులు పోసాని కృష్ణమురళి(Posan KrishnaMurali) అరెస్టును ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారనే కారణంతో కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించింది. పోసానికి ఆరోగ్యం బాగలేదని ఆయన సతీమణి చెబుతున్నా దురుసుగా గచ్చిబౌలిలోని ఆయన నివాసం నుంచి పోలీసులు తీసుకెళ్లారని తెలిపింది. ఇలా ఇంకెంత కాలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తావ్ బాబు? అని విమర్శించింది.
“పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్‌తో బట్టబయలైన పోలీసుల కుట్ర. బుధవారం రాత్రి పోసానిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ.. అతని కుటుంబ సభ్యులకి ఇచ్చిన నోటీసుల్లో మాత్రం గురువారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న పోలీసులు . ఇది నిబంధనల్ని ఉల్లఘించడం కాదా చంద్రబాబూ? ఇలాంటి పోలీసుల్ని ఏం చేయాలి? రెడ్ బుక్ రాజ్యాంగంలో పతాక స్థాయికి చేరిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. నిబంధనలకి పాతరేస్తూ పోసాని కృష్ణ మురళీని అరెస్ట్. మరీ ఇంత బరితెగింపా చంద్రబాబు.” అని ట్వీట్ చేసింది.
కాగా పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏపీకి తరలించారు. ప్రస్తుతం కడపలోని ఓ రహస్య ప్రాంతంలో ఆయనను విచారించారు. కాసేపట్లో రాజంపేట కోర్టులో హాజరుపర్చనున్నారు.