2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధానిగా అమరావతి(Amaravati)ని కాదని మూడు రాజధానుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీకి అసలు ఒక్క రాజధాని లేకుండా పోయింది. ఎన్ని విమర్శలు వచ్చినా మూడు రాజధానులే తమ విధామని వైసీపీ ప్రకటించింది. ఆ నినాదంతోనే 2024 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. అయితే ఆ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో మూడు రాజధానులను ప్రజలు కోరుకోవడం లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై వైసీపీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మాట్లాడిన మాటలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని తెలిపారు. ఆర్థికంగా అప్పట్లో ఉన్న పరిస్ధితులను బట్టి తాము మూడు రాజధానుల వైపు ముందుకు వెళ్లామని చెప్పారు. రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని స్పష్టం చేశారు. దీనిపై పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. అమరావతి శ్మశానంలా ఉందంటూ గతంలో తాను వ్యాఖ్యానించిన మాట వాస్తవమేనని.. కానీ పరిస్థితులను బట్టి అలా మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.