గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వంశీ అరెస్టు అక్రమమని వైసీపీ మండిపడింది. వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని… గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని గుర్తు చేసింది. ఇటీవల సాక్షి సత్యవర్థన్ కూడా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని తెలిపింది. చంద్రబాబు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ ఆగ్రహించింది.
వైసీపీ ట్వీట్‌పై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. అటవికంగా అరాచకం చేసే ఇలాంటి పిల్ల సైకోని చట్టపరంగా శిక్షించడం తప్పా..? అంటూ గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి వీడియోను పోస్ట్ చేసింది. “గన్నవరం నియోజకవర్గం అంటే, దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా సమ సమాజ స్థాపన కోసం జీవితాంతం పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్యగారు మూడు సార్లు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం. ఉక్కు కాకానిగా పిలువబడే కాకాని వెంకటరత్నం గారు, కవిసమ్రాట్, తెలుగు నేలకు జ్ఞానపీఠం తెచ్చిపెట్టిన విశ్వనాథ సత్యనారాయణగారి జన్మభూమి కూడా ఇదే. అంతటి ఘన చరిత్ర కలిగిన గన్నవరం మీద అరాచకం చేసి, అవినీతిలో మునిగితేలి, రౌడీలు, గూండాలతో ప్రతి రోజు అల్లర్లు జరిగేలా చేసిన పిల్ల సైకో పాపం పండింది” కౌంటర్ పోస్ట్ చేసింది.
కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అనంతరం కోర్టు నుంచి నేరుగా వెళ్లి వంశీని సత్యవర్ధన్ కలిశారు. ఈ క్రమంలో సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై పోలీసులు విచారించగా కేసు విత్ డ్రా చేసుకోవాలని తనను కిడ్నాప్ చేసి బెదిరించారని సత్యవర్థన్ తెలిపారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై విజయవాడ పటమట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో ఇవాళ ఉదయం హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.