Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Yoga Day: ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గం యోగా

AP Yoga Day: ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గం యోగా

మాన‌సిక వికాసానికి గొప్ప సాధ‌నాలు యోగా, ధ్యానం

మ‌న ఘ‌న వార‌స‌త్వ సంప‌ద యోగా ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గ‌మ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రివ‌ర్యులు స‌త్య కుమార్ యాద‌వ్ అన్నారు.
ప‌దో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా శుక్ర‌వారం ఎంజీరోడ్డులోని ఏ ప్ల‌స్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు విశిష్ట అతిథిగా హాజ‌రైన మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్‌.. అన‌కాప‌ల్లి నుంచి ఎన్నికైన ఎంపీ సీఎం ర‌మేష్‌; తిరువూరు, ఎచ్చెర్ల శాస‌న‌స‌భ్యులు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు, ఎన్‌.ఈశ్వ‌ర‌రావు; రాష్ట్ర వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమం ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు, క‌మిష‌న‌ర్ డా. వెంక‌టేశ్వ‌ర్‌; ఆయుష్ క‌మిష‌న‌ర్ డా. ఎస్‌బీ రాజేంద్ర‌కుమ‌ర్‌, ఆరోగ్య‌శ్రీ హెల్త్‌కేర్ ట్ర‌స్ట్ సీఈవో డా. జి.ల‌క్ష్మీశ‌, ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి వేడుక‌ల‌ను ప్రారంభించారు. అనంత‌రం మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ ఊపిరి ఉన్నంత వ‌ర‌కు శ‌రీరం, మ‌న‌సు దృఢంగా, శ‌క్తిమంతంగా ఉండాలంటారు స్వామి వివేకానంద‌. శ‌రీరంతో పాటు మ‌న‌సు శ‌క్తిమంతం కావాలంటే అందుకు ఏకైక మార్గం యోగా అని పేర్కొన్నారు. ఈ ఏడాది యోగా ఫ‌ర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఇతివృత్తంతో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ వేడుక‌లు జ‌రుగుతున్నాయ‌ని.. తొలుత మ‌న‌ల్ని మ‌నం యోగా ద్వారా శ‌రీరాన్ని, మ‌న‌సును సంస్క‌రించుకొని త‌ర్వాత సామాజిక శ్రేయ‌స్సుకు కృషిచేయాల‌న్న గొప్ప సందేశం ఇందులో ఉంద‌న్నారు. గౌర‌వ ప్ర‌ధాని దార్శ‌నిక‌త‌తో యోగాను విశ్వ‌వ్యాప్తం చేశార‌ని.. మ‌న భార‌తీయ విశిష్ట సంప‌ద ఫ‌లాలు అంద‌రికీ అందించాల‌నే భావ‌న‌తో ఆయ‌న చేసిన కృషి వ‌ల్ల నేడు 175కు పైగా దేశాలు యోగాను ఆచ‌రిస్తున్నాయని.. ఇది 140 కోట్ల మంది భార‌తీయులకు గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. యోగా, ధ్యానం అనేవి ప్ర‌కృతితో మ‌మేక‌మై మాన‌సిక వికాసానికి తోడ్ప‌డే గొప్ప సాధ‌నాల‌ని పేర్కొన్నారు. ఆరోగ్య‌ప‌ర, ఒత్తిడి స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ముఖ్యంగా యువ‌త యోగాస‌నాలను ఆచ‌రించాల‌ని సూచించారు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు చిన్న‌నాటి నుంచే యోగా ఔన్న‌త్యాన్ని వివ‌రించాల‌న్నారు. ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఛిద్ర‌మ‌య్యే ప‌రిస్థితులు రాకుండా ఉండాలంటే యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ సూచించారు.

- Advertisement -

ఆరోగ్య‌క‌ర స‌మాజ నిర్మాణానికి యోగా: ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు
రాష్ట్ర వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమం ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు మాట్లాడుతూ ఆరోగ్య‌క‌ర స‌మాజ నిర్మాణానికి యోగా సాధ‌న అవ‌స‌ర‌మ‌ని, ఆధునిక జీవ‌న‌శైలిలో ఎదుర‌య్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ఇది తోడ్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. మ‌న వార‌స‌త్వ సంప‌ద అయిన యోగా ఫ‌లాల‌ను
మ‌న‌తో పాటు అంద‌రికీ ల‌భించాల‌నే గొప్ప ఉద్దేశంతో, వ‌సుధైక కుటుంబం భావ‌న‌తో గౌర‌వ ప్ర‌ధాని యోగాను విశ్వవ్యాప్తం చేశార‌న్నారు. శ‌రీరం, మ‌న‌సు మ‌ధ్య సామ‌ర‌స్యం; ఆలోచ‌న‌, చ‌ర్య మ‌ధ్య స‌మ‌తుల్య‌త ద్వారా శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం సొంత‌మ‌వుతుంద‌న్నారు. బీపీ, మ‌ధుమేహం వంటి నాన్ క‌మ్యూనిక‌బుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ)పై విజ‌యం సాధించేందుకు యోగా, ధ్యానం అనేవి గొప్ప మార్గాల‌ని ఎం.టి.కృష్ణ‌బాబు పేర్కొన్నారు.

దీర్ఘ‌కాలంలో గొప్ప ప్ర‌యోజ‌నాలు: ఎంపీ సీఎం ర‌మేష్‌
ఎంపీ సి.ఎం.ర‌మేష్ మాట్లాడుతూ గౌర‌వ ప్ర‌ధాని చొర‌వ కార‌ణంగా అంత‌ర్జాతీయంగా యోగా దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంటున్న‌ట్లు తెలిపారు. పైసా ఖ‌ర్చు లేకుండా యోగాస‌నాల అభ్య‌స‌న ద్వారా శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్నారు. యూట్యూబ్ వీడియోల్లోని యోగా గురువుల మార్గ‌నిర్దేశ‌నంతో ఎక్క‌డికీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండానే యోగా సాధ‌న చేయొచ్చ‌న్నారు. యోగా సాధ‌న‌తో దీర్ఘ‌కాలంలో మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని.. యోగా ఔన్న‌త్యం గురించి మ‌నం మ‌రో ప‌ది మందికి చెప్పాలని ఎంపీ ర‌మేష్ సూచించారు.

స‌రైన జీవ‌న మార్గం యోగా: క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు
కార్య‌క్ర‌మంలో భాగంగా యోగా విశిష్ట‌త‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు వివ‌రించారు. న‌న్ను నేను ఓ ఆరోగ్య‌వంత‌మైన ఉన్న‌త వ్య‌క్తిగా తీర్చిదిద్దుకోవ‌డానికి యోగా స‌రైన జీవ‌న మార్గ‌మ‌ని న‌మ్ముతున్నాను.. నాతోపాటు నా కుటుంబ స‌భ్యుల‌కు, స‌మాజానికి యోగాను అందించ‌డం ద్వారా ఆరోగ్య‌వంత‌మైన‌, విలువ‌ల‌తో కూడిన స‌మాజ నిర్మాణానికి మ‌నఃస్ఫూర్తిగా ప్ర‌య‌త్నిస్తాను.. అంటూ జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అతిథుల‌తో సంక‌ల్పం చేయించారు.

మంతెన స‌త్య‌నారాయ‌ణ‌రాజు సార‌థ్యంలో..
వేడుక‌ల్లో భాగంగా ప్ర‌కృతి వైద్యులు మంతెన స‌త్య‌నారాయ‌ణ‌రాజు సార‌థ్యంలో యోగాస‌నాల సాధ‌న జ‌రిగింది. శ‌రీరంలోని ప్ర‌తి అవ‌య‌వాన్ని ఉత్తేజితం చేసే ఆస‌నాల‌ను సాధ‌న చేయించారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా రోజూ ఓ గంట పాటు యోగాను ఆచ‌రించి శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారు ప్ర‌తి వేదిక‌పైనా యోగా ఔన్న‌త్యాన్ని చెబుతుంటార‌ని పేర్కొన్నారు. ఏపీని ఆరోగ్య ఏపీగా మార్చ‌డానికి యోగా, ధ్యాన సాధ‌న అవ‌స‌ర‌మ‌ని సూచించారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ఆఫ్ ఫార్మ‌సీస్ అండ్ డాక్ట‌ర్స్ వెబ్‌సైట్‌ను, ఆశా/ఏఎన్ఎంల కోసం రూపొందించిన శిక్ష‌ణ పుస్తకాన్ని మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్.. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి ఆవిష్కరించారు. కోల‌వెన్ను ఎంపీపీ పాఠ‌శాల విద్యార్థులు, మంతెన ఆశ్ర‌మ విద్యార్థులు, నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రత్యేక యోగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. కార్య‌క్ర‌మంలో ఆయుష్ రీజ‌న‌ల్ డిప్యూటీ డైరెక్ట‌ర్ ఆర్‌.వెంక‌ట‌కృష్ణ‌, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జిల్లా ఆయుష్ అధికారి డా. పి.సుక‌న్య‌, వైద్యాధికారులు, విద్యార్థులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News