ఆన్‌లైన్ బెట్టింగ్(Online Betting)కు బానిసై ఎంతో మంది యువత తమ సర్వస్వం కోల్పోతున్నారు. మరికొంత మంది అయితే అప్పులు తీర్చలేక ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా యువతను ఈజీ మనీ కోసం బెట్టింగ్‌కు అలవాటు చేసేలా కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రేరేపిస్తున్నారు. ఇందుకోసం రకరకాల వీడియోలు చేస్తూ వారిని ఆకర్షించి బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. ఇటీవల లోకల్ బాయ్, ఫిషర్ మెన్‌గా పాపులర్ అయిన నాని(Local Boy Nani) ఓ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ వీడియోలు పెట్టాడు. దీనిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.
దీంతో సజ్జనార్‌కు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో పెట్టాడు లోకల్ బాయ్ నాని. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని తెలిపాడు. మరోవైపు విశాఖకు చెందిన ఓ యువకుడు బెట్టింగ్ యాప్‌లలో రూ.2కోట్ల వరకు పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న నానిపై ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సజ్జనార్ వీడియో, యువకుడి ఫిర్యాదుతో నానిని ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.