కడప జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి(YS Avinash Reddy) పీఏ రాఘవరెడ్డి(Raghava Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పులివెందులలోని అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డితో ప్రస్తుతం హోంమంత్రి అనిత, ఏపీసీసీ చీఫ్ షర్మిల, సునీతారెడ్డి, ఇతర మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నవంబరు 8న పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాఘవరెడ్డి 20వ నిందితుడిగా ఉన్నారు. రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు భారీగా పులివెందుల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా ఈ కేసు దర్యాప్తు అధికారిగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ వ్యవహరిస్తున్నారు.