YS Jagan| విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan).. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా డయేరియా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం అస్తవ్యస్తం అయిందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే తిరుమల లడ్డూ అంశం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే వెంటనే అక్కడికి డీజీపీని పంపారని.. గుర్లలో ప్రాణాలు పోతుంటే ఒక్క మంత్రి కూడా పరామర్శించలేదన్నారు.
షర్మిలతో జరుగుతున్న ఆస్తి వివాదంపై టీడీపీ చేస్తున్న విమర్శలపైనా జగన్ స్పందించారు. కుటుంబ గొడవలు ప్రతి ఇంట్లో ఉండేవేనని, వాటిని రాజకీయాల్లోకి లాగటం సబబు హితవు పలికారు. మీ ఇళ్లల్లో గొడవలు లేవా అని అధికారపార్టీ నేతలను ప్రశ్నించారు. అయితే తనను మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు ఆపే ప్రయత్నం చేశారంటూ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకుడు మీడియాతో మాట్లాడే పరిస్థితి కల్పించకపోతే ఎలా అని నిలదీశారు. అనంతరం తన ప్రసంగం కొనసాగించిన జగన్.. డయేరియాతో 14 మంది చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తాను ఈ వ్యాధి గురించి ట్వీట్ చేయడంతోనే ప్రభుత్వం స్పందించిందన్నారు.
రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగితే డైవర్షన్ ఎలా చేయాలో చూస్తున్నారు తప్పా.. పనిచేయడం లేదని ధ్వజమెత్తారు. డయేరియా వ్యాధి తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చంపావతి నదిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని.. మెయింటెనెన్స్ రెన్యువల్ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదన్నారు. క్లోరినేషన్ జరిగిందో లేదో కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. మండలంలో 14 మంది చనిపోతే కనీసం విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారంటూ ప్రశ్నించారు. తాము అభివృద్ధి చేసిన స్కూల్లోనే వైద్యం అందించారన్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేకపోతుందని దుయ్యబట్టారు. అలాగే నిర్మాణంలో ఉన్న 12 మెడికల్ కాలేజీలను అమ్మేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.