వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. జగన్ పెద్దనాన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడు వైఎస్ అభిషేక్ రెడ్డి(YS Abhishek Reddy) శుక్రవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతిచెందిన విషయం విధితమే. ఆయన మృతితో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి పులివెందులకు అభిషేక్ రెడ్డి పార్థివదేహం చేరుకుంది. దీంతో ఆయన పార్థివదేహానికి పార్టీలకు అతీతంగా నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. టీడీపీ నేత బీటెక్ రవి, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితర నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఇక సాయంత్రం జరగనున్న అంత్యక్రియలకు జగన్ దంపతులు హాజరుకానున్నారు. ఈమేరకు కాసేపట్లో తాడేపల్లి నుంచి పులివెందుల చేరుకోనున్నారు.