HomeTop StoriesDevarapalli : పొగాకు రైతులను పరామర్శించిన వైఎస్ జగన్.. మార్క్‌ఫెడ్‌ను దించాలని డిమాండ్

Devarapalli : పొగాకు రైతులను పరామర్శించిన వైఎస్ జగన్.. మార్క్‌ఫెడ్‌ను దించాలని డిమాండ్

దేవరపల్లి ( తెలుగు ప్రభ ) : ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన పంట నేడు కంటినీరు తెప్పిస్తోంది! ‘బంగారు పంట’గా భావించే పొగాకు రైతు పరిస్థితి రాష్ట్రంలో అగమ్యగోచరంగా మారింది. కొనుగోళ్లలో తీవ్ర నిరాశ, దళారుల సిండికేట్, మద్దతు ధర లేక నడిరోడ్డుపై నిలబడ్డ రైతన్నల ఆక్రందనలతో ఉమ్మడి గోదావరి జిల్లాలు ఊగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు.

- Advertisement -

దేవరపల్లి కొనుగోలు కేంద్రంలో ప్రత్యక్ష పరిశీలన – కన్నీరుమున్నీరైన రైతన్నలు : దేవరపల్లి వేలం కేంద్రానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్, అక్కడ నిల్వ ఉంచిన పొగాకు బేళ్లను, వేలం పాటల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. గిట్టుబాటు ధర లేక, శ్రమించిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని పలువురు రైతులు జగన్ వద్ద తమ అవేదన వెళ్లగక్కారు.

బుట్టాయిగూడెం మండలానికి చెందిన వెంకటేశ్వరరావు అనే రైతు 10 ఎకరాల్లో పొగాకు సాగు చేసి, నష్టాలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటనను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. బాధితుని కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రభుత్వంలో ఉన్న ఒక్క ప్రజాప్రతినిధి కూడా వెళ్లకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని నిలదీశారు.

గణాంకాలతో గుట్టు రట్టు: రైతుల పరిస్థితిని వివరించేందుకు వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అధికారిక గణాంకాలను ఆధారంగా చూపించారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో (2023–24): రాష్ట్రంలో పొగాకు సగటు ధర కిలోకు రూ. 289 కాగా, గరిష్ఠ ధర రూ. 411 వరకు పలికింది. అదే దేవరపల్లి ప్రాంతంలో సగటు ధర రూ. 326 లభించింది.

ప్రస్తుత చంద్రబాబు పాలనలో: రాష్ట్ర సగటు ధర దారుణంగా రూ. 214కి పడిపోయింది. దేవరపల్లి ప్రాంతంలో కేవలం రూ. 236కి పడిపోవడంతో రైతులకు ప్రతి కిలోపై రూ. 75 నుంచి రూ. 90 వరకు నికర నష్టం వాటిల్లుతోంది. టొబాకో బోర్డు 142 మిలియన్ కిలోల కొనుగోలు చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి పంట సాగు చేయించిందని, అయితే 105 రోజుల వేలం ప్రక్రియ పూర్తయినా ఇప్పటివరకు కేవలం 47.3 మిలియన్ కిలోలు (33% మాత్రమే) కొనుగోలు చేసి రైతులకు వెన్నుపోటు పొడిచారని జగన్ మండిపడ్డారు.

దళారుల ‘సిండికేట్’ రాజ్యం : వేలం కేంద్రాల్లో 30% నుంచి 40% వరకు పొగాకును ‘రిజెక్ట్’ చేస్తున్నారని, ‘నో బిడ్స్’ (No Bids) పేరుతో రైతులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. వ్యాపారులు, కంపెనీలు కార్టెల్‌గా (సిండికేట్‌గా) ఏర్పడి ధరలను శాసిస్తున్నా ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపెడుతోందే తప్ప ఒక్క కొనుగోలుదారుడిపైనా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు.

పరిష్కారం ఏంటి? : గత తమ ప్రభుత్వ హయాంలో పరిస్థితి చేయిదాటకుండా రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ‘మార్క్‌ఫెడ్’ (MARKFED) ద్వారా మార్కెట్లో పోటీ వాతావరణం సృష్టించామని వివరించారు. ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్‌ను కొనుగోలు రంగంలోకి దింపి, ప్రతి గ్రేడ్‌కూ కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ పోటీలో నిలిస్తేనే వ్యాపారుల సిండికేట్ పటాపంచలై రైతులకు సరైన ధర దక్కుతుందని స్పష్టం చేశారు.

విద్యా, వైద్యం, వ్యవసాయం.. అన్నింటా విధ్వంసమే  : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వరి, మొక్కజొన్న, అరటి, పత్తి, మిర్చి, టమోటా, మామిడి సహా ఏ రైతుకూ ఆశించిన లబ్ధి చేకూరడం లేదని, రాష్ట్రంలో గిట్టుబాటు ధర దక్కుతున్న ఏకైక పంట ‘గంజాయి’ మాత్రమేనని ఎద్దేవా చేశారు.

అన్నదాత సుఖీభవ దగా: ఏటా రూ. 20 వేలు ఇస్తామని చెప్పి మూడేళ్లకు రూ. 60 వేలకు గాను కేవలం రూ. 19 వేలు మాత్రమే ఇచ్చారని, సుమారు 7 లక్షల మంది కౌలు రైతులు, గిరిజన రైతులను పథకం నుంచి తొలగించారని ఆరోపించారు.

సున్నా వడ్డీ రద్దు: గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని రద్దు చేసి, ఇప్పుడు రూ. 50 వేల రుణాలంటూ కొత్త ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, అరెస్టులతో ప్రభుత్వం కాలాన్ని వెళ్లదీస్తోందని మండిపడ్డారు.

రైతన్నలకు వైఎస్సార్‌సీపీ అభయం: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 7 లక్షల పరిహారం తక్షణమే విడుదల చేయాలని, లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆ మొత్తాన్ని రెట్టింపు (రూ. 14 లక్షలు) చేసి సదరు కుటుంబానికి అందజేస్తామని జగన్ ప్రకటించారు. మార్క్‌ఫెడ్‌ను తిరిగి బలోపేతం చేసి రైతన్నకు వెన్నెముకగా నిలుస్తామని భరోసానిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News