YS Jagan Mohan Reddy fire on Chandrababu: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కూటమి పాలనలో రైతులు పడుతున్న అవస్థలు ఎల్లో మీడియాకు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతుల పరిస్థతి దారుణంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు లేదని తెలిపారు. ఉల్లి, టమాటా, చీని రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని అన్నారు. చంద్రబాబు చిత్తశుధ్ది ఏంటో ఉల్లిధరలతోనే స్పష్టమవుతోందని ఎద్దేవచేశారు.
పప్పుబెల్లాం మాదిరి అమ్మేస్తున్నారు: కూటమి ప్రభుత్వం దిగజారి మరీ.. స్కాంలు చేస్తుందని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల బాగోగుల పట్ల చంద్రబాబుకు చిత్తశుధ్ది లేదని అన్నారు. చంద్రబాబు తన సంపదను పెంచుకోవడమే సంపద సృష్టి కాదని ఎద్దేవచేశారు. సంపద సృష్టిస్తామని చెప్పి.. పప్పుబెల్లాం మాదిరి ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రైవేట్ దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుందని అన్నారు. ఆ దోపిడీని సామాన్యుడు భరించలేడని తెలిపారు.
రైతుల అవస్థలకు కారణం అదే: ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువుల్ని టీడీపీ నేతలు దారి మళ్లించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. యూరియాలో రూ.250 కోట్ల స్కామ్ జరిగిందని అన్నారు. బ్లాక్‌మార్కెట్ దందాలో చంద్రబాబే భాగస్వామిగా ఉన్నారని అన్నారు. రైతులను పీడించగా వచ్చిన సొమ్మును.. కింద నుంచి పైనేత వరకు అందరూ పంచుకుంటున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.
చిత్తశుద్ధి లేని చంద్రబాబు వల్లే: మా ప్రభుత్వ హయాంలో గట్టి హెచ్చరికలు అధికారులకు వెళ్లేవని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. తప్పు చేయాలంటే అధికారులు భయపడేవాళ్లని తెలిపారు. అందుకే ఇలాంటి సమస్యలు రాలేదని అన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబే దగ్గరుండి స్కాంలు నడిపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు రైతుల మీద చిత్తశుద్ధి లేదని అన్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ.. స్కాంలు చేస్తున్నారు.. వీళ్లు మనుషులేనా? అని వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ల తరఫున మాట్లాడకూడదా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎత్తేశారు అని ఆరోపించారు.


