YS Jagan Nellore Visit: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గురువారం నెల్లూరు పర్యటనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే సత్తెనపల్లి, బంగారుపాళ్యంలానే ఈ పర్యటన కూడా నిబంధనల ఉల్లంఘనల మధ్య కొనసాగడంతో.. మూడు కేసులు నమోదయ్యాయి. ఈ పర్యటనలో కావలికి చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య కింద పడిపోవడంతో ఆయన చేయి విరిగింది.
అసలేం జరిగిందంటే
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు జగన్ పర్యటనకు పోలీసులు నిబంధనలు పెట్టారు. జనసమీకరణ వద్దని సూచించారు. అయినా వైసీపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పకుండా చేసేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి, రోప్ పార్టీలతో నియంత్రణ చర్యలు తీసుకున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలు.. అనేకచోట్ల పోలీసులనే తోసేసుకుని ముందుకొచ్చారు. జైలు నుంచి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు… సుమారు 8.4 కి.మీ. ప్రధాన రహదారిపై జగన్ రోడ్ షో చేశారు. ఈ రోడ్ షోలో ఒకచోట జరిగిన తోపులాటలో ప్రసన్నకుమార్‌రెడ్డి కూడా కిందపడ్డారు. కానీ ప్రమాదం తప్పింది.
తోపులాటలో కానిస్టేబుల్ చేయివిరిగి..
జగన్‌కు స్వాగతం పలికేందుకు రోడ్డుపైకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చుట్టూ భారీగా జనం గూమిగూడారు. అయితే అనుమతి లేదని పోలీసులు వారించినా… ప్రసన్నతో పాటు కార్యకర్తలు ముందుకు కదిలారు. దీంతో వారిని అడ్డుకునేందుకు అధికారులు జీజీహెచ్ సమీపంలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. కానీ పోలీసులపై ప్రసన్నకుమార్‌రెడ్డి కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకు కదిలారు. వెనకాలే ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా వేగంగా ముందుకు కదిలారు. ఈ తోపులాటలో ఒక పోలీసు అధికారి కింద పడిపోగా, మిగిలిన పోలీసులు పక్కకు జరిగారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. ఈ తోపులాటలో కావలి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్యపై వైకాపా కార్యకర్తలు పడటంతో.. ఆయనకు చెయ్యి విరిగిపోయింది.
ఈ పర్యటనలో రోడ్డుపై ధర్నా చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించినందుకు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సహా మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రసన్నతో పాటు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పాతపాటి ప్రభాకర్ తదితరులపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీ చేపట్టినందుకు మరో కేసు కూడా నమోదు చేశారు.


