కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ, ఉచిత ఇసుక విధానంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ పాలన ‘దోచుకో.. పంచుకో.. తినుకో’ (DPT) అన్న చందంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించి.. డిస్టలరీస్ పెంచి తన సొంత ఆదాయాన్ని పెంచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తాము మద్యాన్ని నియంత్రిస్తూనే ప్రభుత్వ ఆదాయం పెంచామని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు(Chandrababu) పాలనలో మద్యం ఏరులై పారుతుందన్నారు. మద్యం షాపులన్నీ తన మాఫియాకే ఇచ్చి దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గ్రామస్థాయిలో మద్యం మాఫియా నడుస్తోందని.. ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు అంటూ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉచిత ఇసుక పేరుతో దోచుకుంటున్నారు..
ప్రభుత్వం ఏర్పడి 5 నెలల గడిచినా సూపర్ 6 లేదు సూపర్ 7 లేదని ఎద్దేవా చేశారు. ఇక రూ.10 వేలు ఇస్తామని చెప్పి వాలంటీర్లను, రూ.15వేలు ఇస్తామని పిల్లలను, ఉచిత బస్సు, రూ.1500 ఇస్తామని మహిళలను మోసం చేశారన్నారు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్నికలప్పుడు ప్రజల ఆశలతో చెలగాటమాడుతూ తప్పుడు ప్రచారాలు చేశారని జగన్ ఆగ్రహించారు. ఓవైపు ఉచిత ఇసుక అంటున్నారని.. మరోవైపు ఇసుక ధరలు చూస్తే దారుణంగా ఉన్నాయన్నారు. గతంలో ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని గుర్తుచేశారు. ఈ 5 నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ మనుషులకే ఇసుక తీసే కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. టెండర్‌కు 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చారని.. అందరూ పండుగ బిజీలో ఉంటే దోచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.
ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రచారం..
ఇక స్కిల్ స్కామ్ కేసు గురించి జగన్ మాట్లాడుతూ ఈడీ ఏమైనా చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. తన మీడియాతో క్లీన్ చిట్ ఇచ్చినట్లు గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమెన్స్ ప్రాజెక్టు కోసం చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారని.. షెల్ కంపెనీల ద్వారా రూ.371 కోట్ల నిధులు మళ్లించారని తెలిపారు. చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఈడీ రిలీజ్ చేసిన నోట్‌లో ఎక్కడైనా ఉందా.? అని జగన్ నిలదీశారు.