Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan Comments on Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. ఏపీకి చెందిన కీలక నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్ సోదరి, వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆమె కూడా స్పందిస్తూ తన ఫోన్ ట్యాప్ అయినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమేనని ఆమె పేర్కొన్నారు. ఇందులో అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హస్తం ఉన్నట్లు ఆరోపించారు. తన ఫోన్‌తో పాటు, తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

- Advertisement -

ఆమె ఆరోపణలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేశారో లేదో తనకు తెలియదని అన్నారు. అయితే గతంలో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని.. ఈ నేపథ్యంలో ఆమె ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు ఏమో అని తెలిపారు. అయినా తనకు తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ జగన్ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. తాము ఆరోపిస్తున్నట్లు ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని జగన్ పరోక్షంగా ఒప్పుకున్నారని పోస్టులు పెడుతున్నారు.

కాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజా విచారణలో భాగంగా SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. కానీ సిట్ విచారణకు సహకరించండం లేదని.. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఇతర బాధితులు సిట్ విచారణకు హాజరై తమ వాంగ్మూలం అందించారు. అయితే వీరంతా కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన ప్రముఖులు వీరేనంటూ ఓ జాబితా బయటకు వచ్చింది. ఆ జాబితాలతో ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల పేరు కూడా ఉంది.

దీనిపై మీడియా ఆమెను ప్రశ్నించగా.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిజమని ఆమె స్పష్టం చేశారు. తన ఫోన్, తన భర్త ఫోన్, తన సన్నిహితుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు స్వయంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారని.. ఓ ట్యాపింగ్ ఆడియో కూడా తనకు వినిపించారని తెలిపారు. కేసీఆర్, జగన్ రాజకీయ సంబంధాల మధ్య రక్తసంబంధం కూడా చిన్నబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఎక్కడికైనా వస్తానని..బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాజాగా షర్మిల ఆరోపణలపై జగన్ పైవిధంగా స్పందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad