YS Jagan Tour: వైయస్సార్ సీపీ అధినేత జగన్ నేడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు రానున్నారు. ఆయన రాక నేపథ్యంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినది విధితమే. బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌లోని రైతులను పరామర్శించేందుకు జగన్ వస్తుండడంతో ఆయన అభిమానులు ఇప్పటికే తండోపతండాలుగా దూసుకొచ్చారు. మార్కెట్ యార్డు రైతులతో మాట్లాడి మామిడి సాగుపై పలు విషయాలను రైతుల నుంచి జగన్ తెలుసుకోనున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ రాకముందే మామిడి మార్కెట్ యార్డులోకి భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. జగన్ వచ్చాకే యార్డులోకి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నా లెక్కచేయని వైసీపీ కార్యకర్తలు గేట్లు తోసుకొని లోపలికి వచ్చారు. అయితే ఆంక్షల నేపథ్యంలో హెలికాప్టర్ వద్ద 30 మంది.. యార్డు లోపల 500 మందికి పోలీసులు అనుమతి ఇచ్చారు.
ఈ పర్యటనలో ఎలాంటి రోడ్‌షోలు లేదా ర్యాలీలు నిర్వహించేందుకు పోలీసులు జగన్ కు అనుమతి ఇవ్వలేదు. అయితే ఇప్పటికే హెలిప్యాడ్ వద్ద వందలాది మంది చేరుకున్నారు. స్థానిక వైసీపీ నేతలు భారీగా జనసమీకరణ చేసినట్లు సమాచారం. బైకులు, కార్లకు ఇంధనం ఉచితంగా ఇచ్చి జనాన్ని పంపిస్తున్నారని పలువురు చెబుతున్నారు. జనసమీకరణకు యత్నించిన స్థానిక వైసీపీ నాయకుల్లో 370 మందికి నోటీసులు జారీ చేశారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో చెన్నై – బెంగళూరు జాతీయరహదారిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.


