ఎన్నికల హామీల అమలుపై ఇంతటి బరితెగింపా ? అంటూ సీఎం చంద్రబాబు(CM Chandrababu)పై వైసీపీ అధినేత జగన్(YS Jagan) సంచలన ట్వీట్ చేశారు. లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అని ఆగ్రహించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు.
“చంద్రబాబు గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?
ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30వేలు ఇస్తామన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్‌ఫోన్‌లో ఉన్నాయి.
రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది మోసమే, ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కాంలే. ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదు.
రోజులు గడుస్తున్నకొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం వారి తరఫున నిలబడుతుంది.” అని జగన్ వెల్లడించారు.