విజయవాడ జిల్లా సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీతో వైసీపీ అధినేత జగన్(YS Jagan) ములాఖత్ అయ్యారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ కూడా జైలు లోపలికి వెళ్లారు. ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జైలు వద్దకు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో పాటు పలువురు వైసీపీ నేతలు వచ్చారు. వంశీతో ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వంశీని అరెస్ట్ చేసిన తీరు దారుణం అని మండిపడ్డారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ కేసును ఉపసంహరించుకున్నాడని గుర్తు చేశారు. అయినా కానీ కిడ్నాప్ కేసు పెట్టి వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ నేత పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. దాడి కేసులో తొలుత వంశీ పేరు లేదని.. తర్వాత 71వ నిందితుడిగా చేర్చారన్నారు. పోలీసులు ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తారని ఆరోపించారు. టీడీపీ నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు వదిపెట్టమని.. తాము అధికారంలోకి రాగానే బట్టలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టమని.. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.