YS Sharmila| 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలనలో ప్రాథమిక హక్కులకు విలువ లేదని.. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. మీడియా గొంతు నొక్కడంతో పాటు ఎన్నికల కమిషన్‌ని కూడా గుప్పిట్లో పెట్టుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీకి భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదన్నారు. అన్ని మతాలను గౌరవించాలి అనేది రాజ్యాంగం చెప్తుంటే బీజేపీ రాజ్యాంగం మాత్రం మతాల మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్తుందని విమర్శించారు.
ఇక ఏపీలో వైసీపీ(YCP) రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి అనేది రాజ్యాంగం చెబుతుందని.. కానీ వీళ్లు మాత్రం అసెంబ్లీకి పోవడం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీకి పోనీ వాళ్ళు రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీతో జరిగిన కొనుగోళ్ల విషయంలో ఎటువంటి దర్యాప్తు లేదన్నారు. అదానీ లంచం ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. రూ.1750 కోట్లు లంచం తీసుకుంటే జగన్(Jagan)పై కనీసం విచారణ లేదని విమర్శలు చేశారు. ప్రతి ఒక్కరూ అదానీకి, మోడీకి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అమెరికా FBI చెప్పినా దర్యాప్తు చేయడం లేదని మండిపడ్డారు.