YS Sharmila| వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(JAGAN)పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “YSR మానస పుత్రిక ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. మహానేత హయాంలో, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకం” అని కొనియాడారు.
“నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని YSR అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి గారు తన హయాంలో పథకాన్ని నీరు గార్చారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారు. తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారు. దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదు” అని ఆమె విమర్శించారు.
“YSR తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీనీ వ్యతిరేకిస్తే..అదే బీజేపీకి జగన్ గారు దత్తపుత్రుడు. బీజేపీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిన మోడీ వారసుడు జగన్ గారు. అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం,ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు. నాడు YCP ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వంనిర్లక్ష్యం చేస్తోంది. వైసీపీ చేసింది మహా పాపమైతే.. కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపం. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం. బకాయిలు ఎవరు పెండింగ్ పెట్టినా.. అవి రిలీజ్ చేసే బాధ్యత ఇప్పుడు మీపై ఉంది. వెంటనే నిధులు విడుదల చేయాలని, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం” అని పేర్కొన్నారు.