ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) బహిరంగ లేఖ రాశారు. విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహన రంగా(Vangaveeti Mohana Ranga) పేరును పెట్టాలని లేఖలో పేర్కొన్నారు.
“గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ నుంచి గన్నవరం దగ్గరలోని చిన్న అవుటుపల్లి వరకు 47.8 కిలోమీటర్ల దూరం గల విజయవాడ పశ్చిమ జాతీయ బైపాస్ రహదారి పూర్తి కావొచ్చినందుకు సంతోషం. ఈ 6 వరసల రహదారి ద్వారా విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేర గట్టెక్కుతాయి. ఈ బైపాస్ రహదారికి విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. రంగా గారు ప్రజలకు చేసిన సేవ అనిర్వచనీయం. సామాజిక న్యాయంపై దృష్టి సారించి, అణగారిన వర్గాల సంక్షేమం కోసం వాదించి, భూమి లేని వారికి భూపంపిణీ చేసి ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి “వంగవీటి మోహన రంగా బైపాస్ జాతీయ రహదారి”గా పేరు పెట్టేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కోరుతున్నాం” అని లేఖలో వెల్లడించారు.