దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను సొంత ఏజెన్సీలుగా వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“బ్రష్ట్ జుమ్లా పార్టీ బీజేపీకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుంది. దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేక పోతుంది. అందుకే దర్యాప్తు సంస్థలు CBI,EDలను సొంత ఏజెన్సీలుగా వాడుతుంది. ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తుంది. అగ్ర నాయకత్వాన్ని అణగదొక్కాలని చూస్తుంది. ప్రశ్నించే గొంతును నొక్కాలని కుట్రలు చేస్తుంది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేయడాన్ని, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ గారిపై ED ఛార్జ్ షీట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
‘మనీ’నే లేని కేసులో మనీ ల్యాండరింగ్ జరిందని ఆరోపణలు చేయడం అత్యంత దారుణం. భారత స్వాతంత్ర్య సమరయోధులను, దేశ మహోన్నత నేతలను,వారు చేసిన కృషిని బీజేపీ అవమానపరుస్తోంది. ఇది ప్రజాస్వాయాన్ని ఖూనీ చేయడమే. బీజేపీ చేస్తున్న నీచ రాజకీయాలకు, ప్రతీకార చర్యలకు ఇది నిదర్శనం. మీ వేధింపులకు మౌనంగా ఉంటూ..మీ దుశ్చర్యలను చూస్తూ ఊరుకునేది కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మీద మీరు చార్జిషీట్ వేయడం కాదు.. బీజేపీ మీదే ప్రజలే ఛార్జ్ షీట్ వేసే సమయం దగ్గరపడింది. అదానీ లాంటి వాళ్ళకు దేశాన్ని ఎలా దోచి పెడుతున్నారో అర్థం అయ్యింది. సత్యమేవ జయతే” అని పేర్కొన్నారు.