Homeఆంధ్రప్రదేశ్Congress: పెద్దల సభకు వైఎస్ షర్మిల.. అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌?

Congress: పెద్దల సభకు వైఎస్ షర్మిల.. అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌?

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ ఎంపీ సీటు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మూడు రాజ్యసభ స్థానాలు త్వరలోనే ఖాళీ కాబోతున్నాయి. అక్కడ ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఈ మూడు స్థానాలూ అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందులో ఒక స్థానాన్ని వైఎస్ షర్మిలకు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన సన్నిహితల వద్ద ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం.

- Advertisement -

గతంలోనే హామీ ఇచ్చిన రాహుల్: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆమెను పెద్దల సభకు పంపిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే గత ఎన్నికల్లో ఆమె కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలోనే షర్మిల.. రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ కావడం కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది.

Also Read-AP Pensions: జూన్ నెల ఎన్టీఆర్ భరోసా నిధులు విడుదల

డీకే శివకుమార్ మద్దతు!: కర్ణాటకకు కాబోయే సీఎం డీకే శివకుమార్ కుటుంబంతో వైఎస్ షర్మిలకు దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షర్మిలను రాజ్యసభకు పంపే విషయంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ఆయనే స్వయంగా కాంగ్రెస్ హైకమాండ్‌కు సిఫార్సు చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే త్వరలోనే వైఎస్ షర్మిల అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News