బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరంగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. 30 మోసాలు, 60 అబద్ధాలు అనే సామెతను తలపించిందని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.
“శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగం పూర్తిగా సత్యదూరం. ప్రజల అంచనాలకు భిన్నంగా 30 మోసాలు, 60 అబద్ధాలు అనే సామెతను తలపించింది. గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పించారు. కూటమి కరపత్రాన్ని చదివించారు. అరచేతిలో వైకుంఠం చూపించడం తప్పా.. మ్యానిఫెస్టో హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన ఎక్కడా లేదు. 8 నెలలు దాటినా ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పలేదు. సూపర్ సిక్స్ పథకాలపై క్లారిటీ లేనే లేదు. జాబ్ క్యాలెండర్ లాంటి మిగతా హామీలపై అసలు ప్రస్తావనే లేదు. రాష్ట్ర పునర్ నిర్మాణం అంటూ కాలయాపన తప్పా.. పథకాలను అమలు చేస్తారని ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చింది.
రూ.3వేల నిరుద్యోగ భృతి కోసం 50 లక్షల మంది యువత.. 84 లక్షల మంది విద్యార్థులు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఎకరానికి రూ.20 వేలు ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకం కోసం 54 లక్షల మంది రైతులు, ఉచిత ప్రయాణం, నెలకు రూ.1500 ఇచ్చే మహాశక్తి పథకం కోసం కోటి మంది మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదు. పేదవాళ్లకు సొంత ఇంటి కోసం చేపట్టిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం లేదు. అందుకే ఈ నెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రజల ఆశయాలకు అద్దంపట్టేలా ఉండాలని, సూపర్ సిక్స్ హామీలను ఈ ఏడాది నుంచే అమలు చేసేలా నిధులు కేటాయించాలని, జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం” అని షర్మిల పేర్కొన్నారు.