YS Sunitha| దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదు సంవత్సరాలు దాటినా ఇంతవరకు ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. దీంతో తన తండ్రికి న్యాయం జరగాలంటూ సుదీర్ఘకాలంగా ఆయన కుమార్తె సునీతారెడ్డి న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ జరిగేలా చూశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని ఆమె ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు.
ఈ క్రమంలోనే సునీతారెడ్డి తాజాగా కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ను కలిశారు. కేసు విచారణను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వివేకానంద రెడ్డి హంతకులకు శిక్ష పడే విధంగా పోలీసులు కూడా సహకరించాలని కోరారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి అభ్యంతరకర పోస్టులపైనా ఎస్పీతో చర్చించారు. కాగా విద్యాసాగర్ కంటే ముందు కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజును కూడా గత ఆగస్టు నెలలో కలిశారు సునీత. తొలుత హోంమంత్రి అనితను కలిసి సీబీఐ విచారణకు పోలీసులు సహకరించేలా చూడాలని కోరారు.