YCP Party Symbol: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తును మార్చాలంటూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షడు శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై తాజాగా శివకుమార్ స్పందించారు. పార్టీ గుర్తు మార్చాలంటూ తాను లేఖ రాసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను యుగ తులసి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నానని.. త్వరలో జరగబోయే హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం జగన్‌ను కోరారు.
దివంగత సీఎం వైఎస్సార్ మరణానంతరం శివకుమార్ అనే వ్యక్తి వైఎస్సార్ పేరుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అయితే వైఎస్ కుమారుడు జగన్.. శివకుమార్ నుంచి పార్టీని తీసుకున్నట్లు చెబుతూ ఉంటారు. వైసీపీ పార్టీ గుర్తుగా ఫ్యాన్ సింబల్ ఉండేది. 2012 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైనే పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. అయితే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన శివకుమార్ పార్టీ గుర్తుగా గొడ్డలిని కేటాయించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారంటూ జరిగిన ప్రచారం తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read: ఈ నెల 21న కాలేజీలు బంద్.. ఎందుకంటే..?
కాగా ఈ లేఖలో తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని 1968 ఎన్నికల చిహ్నాల ఆర్డర్ ప్రకారం సంబంధిత నియమాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా తమ పార్టీ కొత్త చిహ్నంగా గొడ్డలిని కేటాయించాలని కోరారు. ఇందుకోసం పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి అవసరమైన పత్రాలు జతచేశామని తెలిపారు. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని.. ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పూర్తిగా సహకరిస్తామని లేఖలో వెల్లడించారు. ఈ లేఖపై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడంతో తాను అసలు ఎన్నికల సంఘానికి లేఖే రాయలేదని..అదంతా అవాస్తమని శివకుమార్ స్పష్టం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.



