Homeఆంధ్రప్రదేశ్Tributes : పేదల పాలిట పెన్నిధి ‘వైఎస్సార్‌’... పిఠాపురంలో వంగా గీత ఘన నివాళి

Tributes : పేదల పాలిట పెన్నిధి ‘వైఎస్సార్‌’… పిఠాపురంలో వంగా గీత ఘన నివాళి

పిఠాపురం (తెలుగు ప్రభ ): తెలుగు నేలపై పేదరిక నిర్మూలనకు బాటలు వేసి, సంక్షేమానికి సరికొత్త భాష్యం చెప్పిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమైనా… ప్రజల గుండెల్లో ఆయన నింపిన ఆశల దీపాలు నిరంతరం దేదీప్యమానంగా వెలుగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 2న నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావోద్వేగపూరితంగా ఘన నివాళులు అర్పించాయి. మాజీ ఎంపీ, పిఠాపురం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వంగా గీత నేతృత్వంలో ఈ సంస్మరణ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది.

- Advertisement -

మున్సిపల్ కార్యాలయం వద్ద పూలమాలలతో నివాళి : బుధవారం ఉదయం పిఠాపురం పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో దివంగత నేత చిత్రపటానికి, అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్ కాంస్య విగ్రహానికి వంగా గీత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి “జోహార్ వైఎస్సార్” అంటూ నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు.

సంక్షేమానికి చిరునామా ‘మహానేత’ పాలన : ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారిన తరుణంలో ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ తీసుకొచ్చి ప్రాణదాతగా నిలిచారని గుర్తుచేశారు. ఆపదలో ఉన్నవారికి ‘108’ అంబులెన్స్ సేవలు నేటికీ జీవనాడిగా మారాయని పేర్కొన్నారు. పేద కుటుంబాల బిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించి ఇంజనీర్లు, డాక్టర్లుగా స్థిరపడటానికి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకమే పునాది అని కొనియాడారు. రైతన్నను రాజుగా చూడాలన్న తపనతో అపర భగీరథుడిలా ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.

నిత్యావసరాల ధరల మంటపై ధ్వజం : ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వ తీరుపై వంగా గీత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్య, మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించడం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మార్కెట్ నియంత్రణపై చేతులెత్తేసిందని, పెరిగిన ధరలను అదుపు చేయడంలో చొరవ చూపకపోతే సామాన్య ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. తక్షణమే నిత్యావసరాల ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు : ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు గండేపల్లి బాబి, రావుల మాధవరావు, కొతెం దత్తుడు, వజ్రపు వీరేష్‌లతో పాటు గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మహానేత ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రతినబూనాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News