Monday, December 4, 2023
Homeఆంధ్రప్రదేశ్YSR Vahana Mitra: వరుసగా ఐదో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర

YSR Vahana Mitra: వరుసగా ఐదో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర

మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలి

వరుసగా ఐదో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం కింద 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.279.93 కోట్ల ఆర్ధిక సాయం అందజేశారు సీఎం వైెస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ విద్యాధరపురంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.

- Advertisement -

ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో లబ్ధిదారులనుద్దేశించి మాట్లాడిన సీఎం. సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:

ఈ రోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, ఆప్యాయతల మధ్య మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం.
ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వా, తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. బ్రతుకుబండి లాగడానికి ఇబ్బందిపడే ఆటో, టాక్సీల డ్రైవర్‌ అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు ఇవాళ బాసటగా నిలుస్తూ మీ అన్న ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర కార్యక్రమం అమలు చేస్తోంది. కార్యక్రమంలో భాగంగా ఇవాళ నా అన్నదమ్ముల అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తున్నాం. సొంతంగా ఆటో, టాక్సీల కలిగి వాటిని నడుపుకునే డ్రైవర్లకు, వారి వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ తెచ్చుకోవడంతో పాటు ఇతర ఖర్చుల కోసం ఏడాదికి ఒకసారి రూ.10వేలు పడుతుంది. ఒక్కసారి కట్టుకోవాలంటే ఇబ్బందిపడే పరిస్థితుల్లో ఉన్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకు ప్రతిఏటా రూ.10వేల ఆర్ధిక సహాయం చేసే వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వరుసగా ఐదో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర.
ఇవాళ దేవుడి దయతో వరుసగా ఐదో ఏడాది వాహనమిత్ర కార్యక్రమం ద్వారా నా డ్రైవర్‌ అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం.

2.75,931 మంది డ్రైవర్‌ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ.276 కోట్లు ఈ కార్యక్రమంలో భాగంగా బటన్‌ నొక్కి వాళ్ల అకౌంట్లలోకి పంపిస్తున్నాం. ఈ విధంగా ఐదు పర్యాయాలు ఒక్కొక్కరికి రూ.50వేల వరకు ప్రతిఆటో డ్రైవర్‌ అన్నదమ్ముడికి, అక్కచెల్లెమ్మకి గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం, ఏ ఏడాది మిస్‌ కాకుండా తోడుగా ఉంటూ ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా రూ.1300 కోట్లు నా అన్నదమ్ముల, అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పంపించాం. స్వయం ఉపాధితో లక్షలమందికి సేవ చేస్తూ… ఆటోలు, టాక్సీలు నడుపుతున్న కుటుంబాల వారు తమకు తాము స్వయం ఉపాధి కల్పించుకొని, తమ కాళ్లమీద తాము నిలబడటమే కాకుండా రోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలందిస్తున్నారు. ఆటో నడుపుకుంటున్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా రూ.10వేలు పెడుతున్నాం. ఈ డబ్బు ఎలా వాడతారు, దేనికి వినియోగిస్తారన్నది నేను అడగను. కానీ మీ అందరికి సవినయంగా ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను. కచ్చితంగా ఎఫ్‌సి, ఇన్సూరెన్స్‌.. మీ వాహనాలకు సంబంధించి ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ కచ్చితంగా ఉండేటట్టు చూసుకొండి. మీ వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్‌ కూడా కచ్చితంగా ఉండేట్టు చూసుకొండి. ఎందుకంటే మీ బండిలో ప్రయాణికులు ఉన్నారన్నది మర్చిపోవద్దు.

సొంతవాహనాలు నడుపుతున్న డ్రైవర్లు కానీ, సమాజంలో ఎన్నో సేవలందిస్తున్న అనేక మంది కష్టాలను, కన్నీళ్లను తుడుచేందుకు వారికి తోడుగా నిలబడుతుంది మీ ప్రభుత్వం, మీ జనగన్న ప్రభుత్వం. ప్రతి సంక్షేమ పథకం గడపవద్దకే ఈ రోజు ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం చేయించడం, రేషన్‌ కార్డులు దగ్గర నుంచి ఇంటివద్దకే పెన్షన్‌ ఇవ్వడం, జనన ధృవీకరణ, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు జల్లెడ పడుతూ మీ అవసరాలు ఏమున్నాయో తెలుసుకుని ఇంటివద్దకే తీసుకొచ్చి అందిస్తున్నాం. నవరత్నాల్లోని ప్రతి సంక్షేమపథకాన్ని నేరుగా గడపవద్దకే చేర్చుతున్నాం. నా పేద అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల పిల్లలు కచ్చితంగా గొప్పగా చదవాలన్న ఆరాటంతో తపిస్తూ మన ఊర్లలోని ప్రభుత్వ బడికే ఇంగ్లిషుమీడియం చదువులను తీసుకొచ్చాం. మీ గ్రామానికే, మీ వార్డుకే ఎక్కడా లంచాలు లేని, వివక్షలేని పారదర్శక వాలంటీర్‌ వ్యవస్ధను తీసుకొచ్చాం. మీ గ్రామానికే, మీ వార్డుకే సచివాలయ వ్యవస్ధను తీసుకొచ్చాం. మీ గ్రామానికే విలేజ్‌ క్లినిక్‌ తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉంచాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ను ముందుకు తీసుకొచ్చి మీ ప్రతి గ్రామానికి, వార్డుకి, ఇంటికి పరిచయం చేస్తూ.. జల్లెడ పడుతూ ఏకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఇంట్లో ఉన్న వారికీ బీపీ, షుగర్, హెచ్‌బీ, కఫం టెస్టులు చేయిస్తూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తపన పడుతూ అడుగులు వేస్తున్నాం. గ్రామ, వార్డు స్ధాయిలోనే మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం, ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలోని ఫోన్‌లో దిశ యాప్‌ ఉండేటట్టు చూసుకోవడం, గ్రామస్ధాయిలో రైతన్నలను చేయిపట్టుకుని నడిపిస్తూ.. పంట వేయడం దగ్గర నుంచి పంట అమ్మకం వరకూ ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ ఆర్బీకే వ్యవస్ధలు స్ధాపించాం.

నా పాదయాత్రలో మీ కష్టాలు కళ్లరా చూసి..ఇవన్నీ కూడా ఎవరో చెబితేనో.. ఎవరో ఉద్యమాలు చేస్తేనో తీసుకొచ్చినవి కావు. ఇవన్నీ నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీరు పడ్డ సమస్యలను నా కళ్లారా చూసి, మీలో ఒకడిగా ఈ నాలుగు సంవత్సరాలుగా మీ బిడ్డ పరిపాలనలో.. మీ సమస్యలకు పరిష్కారం వెదుకుతూ అడుగులు వేశాం. గళం లేని వారి గొంతుకనై…ఆ బాధ్యత నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్ధలో వాయిస్‌ ఆఫ్‌ ది పీపుల్‌ అంటారు. కానీ మీ బిడ్డ పరిపాలనలో వాయస్‌ ఆఫ్‌ ది వాయస్‌లెస్‌ అంటే… ఏ పేదవాడు అయితే తన కష్టాన్ని చెప్పుకోలేనివాడు, తన ఆర్తిని వినిపించలేనివాడు, ఆ ప్రజల కోసం గొంతుకై వాళ్ల తరపున నిలబడుతున్న ప్రభుత్వం మనది. కాబట్టే ఈ రోజు అట్టడుగు ఉన్న పేదవాడు బాగుండేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి.. మనసా, వాచా, కర్మణా మీ బిడ్డ నమ్మాడు కాబట్టి ఆ దిశగా ఈ నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. రైతుల కోసం…
ఈ రోజు రాష్ట్రంలో 52.39 లక్షల మంది రైతన్నల కష్టాలు, కన్నీళ్లు తెల్సిన ప్రభుత్వంగా 62 శాతం జనాభావ్యవసాయం మీద ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో ఆ రైతన్న కన్నీళ్లు పెట్టకూడదని ఏకంగా వారికి తోడుగా నిలబడేందుకు రూ.30985 కోట్లు ఒక్క వైఎస్‌ఆర్‌ రైతుభరోసా పథకం మీద మాత్రమే ఖర్చు చేశాం.
పంటలు వేసే సమయానికి పెట్టుబడి ఖర్చుల కింద ఆ రైతన్నల చేతుల్లో పెట్టే గొప్ప కార్యక్రమానికి ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలోనే బీజం పడింది.


పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం కాబట్టి…ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి ఉందా? అన్నది రైతన్నలకు తెలుసు. గంగ పుత్రులకు అండగా..
వేట నిషేధ సమయంలో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార సోదరులు.. తమ గొంతు వినిపించలేని 2.43లక్షల మంది నా మత్సకార కుటుంబాలకు ఈ ఐదేళ్ల కాలంలో మత్స్యకారభరోసా అనే ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా ఏకంగా రూ.538 కోట్లు నా అన్నదమ్ముల, అక్కచెల్లెమ్మల కుటుంబాల చేతుల్లో పెట్టి వాళ్ల కష్టాల్లో తోడుగా నిలబడ్డాం. ఇలాంటి మేలు చేసే ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి ఉందా? అన్నది నా మత్స్యకార కుటుంబాలకు తెలుసు. నేతన్నలకు నేస్తంగా..
మగ్గం కదిలితే తప్ప బ్రతుకు బండి నడవని నా చేనేతన్నలున్నారు. అలాంటి 82 వేల చేనేత కుటుంబాలకు ఈ ఐదేళ్లలో ఒక్క నేతన్ననేస్తం అనే పథకం ద్వారా… రూ.982 కోట్లు వారిని ఆదుకునేందుకు వారి చేతిలో పెట్టాం.

ఇంతకముందు ఏ ప్రభుత్వమైనా ఇంతగా వారికి తోడుగా లేదన్నది ఈ నేతన్నలకు తెలుసు. తోడు అందిస్తూ – చేదోడుగా నిలుస్తూ..
జగనన్న తోడు, జగనన్న చేదోడు.. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే, పుట్‌ఫాత్‌ల మీద చిరువ్యాపారులు కనిపిస్తున్నారు. వాళ్లు ఎలా వ్యాపారాలు చేసుకుంటున్నారు ? ఆ వ్యాపారాలకు పెట్టుబడి ఎక్కడ నుంచి వస్తుంది ? ఆ పెట్టుబడి కోసం డబ్బులు ఎంతెంత వడ్డీకి తీసుకొస్తున్నారన్నది ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ ఆలోచన కూడా చేయలేదు. అలాంటి 15.87 లక్షల మంది చిరువ్యాపారులకు జగనన్న తోడుగా.. ఇంతవరకు వడ్డీలేని రుణాల రూపంలో రూ.2956 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టాం.
నా రజక సోదరులు, నాయూ బ్రాహ్మణులు, టైలర్‌ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు ఎలా బ్రతుకుతున్నారు ? బ్రతకడానికి వాళ్లు పడుతున్న ఇబ్బందులేమిటి ? అన్నది గతంలో ఏ ఒక్కరూ ఎప్పుడూ చూసిన పరిస్థితులు లేవు. అటువంటి వాళ్లకు జగనన్న చేదోడు అన్న పథకం తీసుకొచ్చి 3.30 లక్షల మందికి ఇప్పటివరకు అందించిన సాయం రూ.927 కోట్లు.


ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం గతంలో రాష్ట్రంలో మరొక్కటి లేదన్నది ఆ చిరువ్యాపారులకు, నా టైలర్‌ అన్నదమ్ములకు, నాయి బ్రహ్మణ సోదరులకు, రజకులకు వారి కుటుంబసభ్యులకు తెలుసు. అక్కచెల్లెమ్మల మొహంలో కన్నీరు కనపడకూడదని..నా అక్కచెల్లెమ్మలు బాగుంటేనే వాళ్ల కుటుంబాలు బాగుంటాయి. వీళ్ల ముఖాన కన్నీరు కనపడిందంటే.. ఏ కుటుంబానికి మంచి జరగదు. నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండాలని ఆర్ధిక సాధికారత కోసం వారి తరపున ఉద్యమం చేస్తున్న ప్రభుత్వం మనది కాబట్టే.. ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ జగనన్న అమ్మఒడి అనే పథకం తీసుకొచ్చాం.
ఆ అక్కచెల్లెమ్మలు ఎలా బ్రతుకుతున్నారు ? వారి పిల్లలు ఎలా చదువుతున్నారు, వారి చదువులు కోసం ఆ తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నది గతంలో ఎవరూ ఆలోచన చేయలేదు. ఆ పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడు అన్న ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ మీ బిడ్డ జగనన్న అమ్మఒడి తీసుకొచ్చాడు. 52 నెలల్లోనే 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అమ్మఒడి అనే పథకానికి మాత్రమే రూ.26వేల కోట్లు విడుదల చేశాం. జగనన్న విద్యాదీవెన కింద 26.99 లక్షల మంది తల్లులకు ఆ పిల్లల పెద్ద చదువులు కోసం అందించిన సహాయం రూ.11,317 కోట్లు. నా అక్కచెల్లెమ్మల పిల్లలు గొప్పగా చదివి ఇంజనీర్లు కావాలని.. అది చూసి సంతోషపడాలని వాళ్ల మేనమామగా తపించి ఆ అక్కచెల్లెమ్మల కోసం చేసిన సహాయం అది. జగనన్న వసతి దీవెన ఈ పథకం ద్వారా 25.17 లక్షల అక్కచెల్లెమ్మలకు వాళ్ల చదువులుతో పాటు బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చుల కోసం ఇబ్బంది పడకూదడని, ఆ ఖర్చులు కూడా పెట్టుకోలేని అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడాలని, సంవత్సరానికి రూ.20 వేలు వరకు అందిస్తూ.. వారికి మంచి జరగాలని జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4,275 కోట్లు వెచ్చించాం. నా అక్కచెల్లెమ్మలు బాగుండాలని…గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన మాట నమ్మి అవస్ధలు పడుతున్న పొదుపుసంఘాల అక్కచెల్లెమ్మలు మోసపోయారు. అలా మోసపోయి, అవస్ధలుపడుతున్న అక్కచెల్లెమ్మలు ఖాతాలన్నీ కూడా ఎన్‌పీఏలుగా, అవుట్‌స్టాండింగ్‌ లోన్స్‌గా దాదాపూ 18శాతానికి చేరాయి. అలా బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్న అక్కచెల్లెమ్మల కోసం వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాన్ని తీసుకొచ్చి.. 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,178 కోట్లు ఇచ్చాం. ఈ సహాయమే ఆ అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టకపోయి ఉంటే 18శాతంఉన్న ఆ ఎన్‌పీఏలు, అవుట్‌ స్టాండింగ్‌ లోన్స్‌ ఏ 50 శాతం దాటి ఉండేవి. వారికి తోడుగా ఉంటూ వైఎస్‌ఆర్‌ ఆసరా ఒకటి తీసుకుని రావడమే కాకుండా… ఆ కోటి మంది అక్కచెల్లెమ్మలకు వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని తీసుకొచ్చాం.


దాదాపుగా రూ.5వేల కోట్లు ఈ సున్నావడ్డీ పథకంతో అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాం. నా అక్కచెల్లెమ్మలు బాగుండాలని చేశాం. 45 నుంచి 60 సంవత్సరాల అత్యంత బాధ్యతాయుతమైన వయస్సులో.. ఉన్న వాళ్ల చేతుల్లో ఆ డబ్బులు పెడితే వాళ్ల కుటుంబాలు బాగుపడతాయని 26.40 లక్షల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల కోసం వైఎస్‌ఆర్‌ చేయూత పథకం తీసుకొచ్చాం. రూ.14,129 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. వైఎస్‌ఆర్‌ కాపునేస్తం ఈ పథకం ద్వారా 3.58 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు సాయం అందించాం. వైఎస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4.39లక్షల ఓసీలలో ఉన్న నిరుపేద అక్కచెల్లెమ్మలకు అందించిన సహాయం రూ.1257 కోట్లు. అలాగే నా అక్కచెల్లెమ్మలు శ్రీమంతులు కావాలి, లక్షాధికారులుగా ఉండాలి. ఇళ్లు లేని నా అక్కచెల్లెమ్మలు ఎవరూ ఉండకూడదు అని 30.76 లక్షలమంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చాం. అందులో ఇప్పటికే 21.32 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇంతగా అక్కచెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాకుండా.. దేశ చరిత్రలో కూడా ఎక్కడైనా ఉందా ? అన్నది నా అక్కచెల్లెమ్మలు తెలుసు. ఇవన్నీ కూడా ఎవరో అడిగితేనో, ఎవరో ఉద్యమాలు చేస్తేనో వచ్చినవి కావు. ఇవన్నీ కూడా మీ బిడ్డ.. మీలో ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. మీ కష్టాలు,సుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. మీ ప్రభుత్వం కాబట్టే ఇవన్నీ కూడా మీ అందరికీ జరుగుతున్నాయి. రాబోయేది కురుక్షేత్ర యుద్ధం ఇలాంటి మనసున్న ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఒకవంక ఉంటే.. మరో వంక మనసు లేని గత పాలకులు మరో వంక ఉన్నారు. రేపొద్దున్న కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. వీరిద్దరి మధ్యే ఈ యుద్ధం జరగబోతుంది. నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వం ఒకవైపున ఉంటే.. మరో వైపున ఉన్న నిరుపేదలను వంచించిన గత ప్రభుత్వంతో యుద్ధం జరగబోతుంది. వచ్చే ఎన్నికల్లో జరగబోయే యుద్ధం నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు మంచి చేస్తున్న మన ప్రభుత్వం ఒకవైపున ఉంటే.. మరోవైపున సామాజిక అన్యాయాలు, ప్రాంతాలకు అన్యాయాలు చేయడమే చరిత్రగా ఉన్న మన ప్రత్యర్ధులు మరోవైపున ఉండే యుద్ధం జరగబోతుంది. 99 శాతం వాగ్ధానాలను అమలు చేశాం..


ఒక మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంధమైన భగవద్గీతగానూ, బైబిల్‌గానూ, ఖురాన్‌గానూ భావించి.. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీది అమలు చేస్తూ… 99 శాతం వాగ్దానాలను పూర్తి చేసి ఇప్పటికే మాట నిలబెట్టుకున్న మన ప్రభుత్వానికి, మరోవైపున ఎన్నికల ప్రణాళిక, మేనిఫెస్టో అంటే అది ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడానికి మాత్రమే తేవాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయాలి. అలా చెత్తబుట్టలో వేసి కేవలం 10శాతం వాగ్ధానాలను కూడా నిలబెట్టుకోలేని మన ప్రత్యర్ధులు మరోవంక ఉండే కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. వచ్చే ఎన్నికల్లో నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీరికి 80శాతం డీబీటీగా నేరుగా బటన్‌ నొక్కి వారికే అందజేసి, 83 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రామసచివాలయాల్లో నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలకే అందించిన మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే.. మరోవైపున ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా ? అన్న అహంకారానికి, బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్డార్‌ అన్న కండకావరానికి మధ్య యుద్ధం జరగబోతుంది. పేదలకు- పెత్తందార్లకూ యుద్దం.
వచ్చే ఎన్నికల్లో గవర్నమెంటు బడులలో, నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా పేద ఓసీ వర్గాల పిల్లలకు సీబీఎస్‌ఈ సిలబస్‌ అందాలి. ఇంగ్లిషు మీడియం కావాలని వాటిని ప్రవేశపెట్టి.. ఇవే కాకుండా ఇంటర్నేషనల్‌లో కూడా వారు పోటీపడాలని ఐబీ సిలబస్‌ కూడా తీసుకొచ్చి ఆ దిశగా కూడా అడుగులు వేయిస్తున్న మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే.. మరోవైపున ఈ పేద వర్గాలకు ఇంగ్లిషు మీడియం చదువులు ఉండరాదు, ఇటువంటి వాళ్లు పెద్ద చదువులు చదవకూడదు అనే పెత్తందారీ మనస్తత్వం ఉన్న వారికి యుద్ధం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30.76 లక్షల నా అక్కచెల్లెమ్మలు, పేదలెవరూ ఇబ్బంది పడకూడదని ఇళ్ల పట్టాలు ఇచ్చి, వారు ఒక ఇంటివారు కావాలని మనందరి ప్రభుత్వం ఒకవైపున ఉంటే.. మరోవైపున ఈ పేదలకు ఇళ్లపట్టాలే ఇవ్వకూడదు, వారికి ఇళ్లపట్టాలిస్తే డెమోగ్రాఫిక్‌ ఇంబేలన్స్‌ … అంటే కులాల మధ్య వ్యత్యాసం వస్తుందని ఏకంగా కోర్టులకెళ్లి కేసులు వేస్తున్న ఆ పెత్తందారీ భావజాలానికి మధ్య రాబోయే రోజుల్లో యుద్ధం జరగబోతుంది. పైసా లంచం లేకుండా రూ.2.35 లక్షల కోట్ల డీబీటీ
వచ్చే కురుక్షేత్ర యుద్ధం ఒక్క పైసా కూడా అవినీతి, లంచం, ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా రూ.2.35 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డీబీటీ ద్వారా డబ్బులు పంపించిన మన ప్రభుత్వం ఒకవైపు… మరోవైపున ఫైబర్‌ గ్రిడ్‌ స్కాం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కాం, అసైన్డ్‌ భూముల స్కాం, అమరావతి పేరిట చేసిన అతిపెద్ద దగా, జన్మభూమి కమిటీల పేరిట చేసిన దుర్మార్గం, నీరు చెట్టు పేరిట చేసిన దోపిడీ, రైతులకు చేసిన మోసాలు, అక్కచెల్లెమ్మలకు మాట ఇచ్చి చేసిన వంచనలు, పిల్లలను సైతం వదలకుండా అన్ని వర్గాలను మోసం చేసిన వీరికి మధ్య యుద్ధం జరగబోతుంది. ఆలోచన చేయండి. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. కేవలం మారిందల్లా ముఖ్యమంత్రి ఒక్కడే. అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలో తక్కువే. మరి మీ బిడ్డ ఎందుకు బటన్‌ నొక్కగలుగుతున్నాడు. రూ.2.35 లక్షల కోట్లు ఎటువంటి వివక్ష, లంచాలు లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఎలా పోగలుతున్నాయి. గతంలో ఎందుకు డబ్బులు రాలేదు ? ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి ? అన్నది ఆలోచన చేయండి. కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి స్ధానం మాత్రమే. వారికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేసేందుకు కాదు. వాళ్లకు అధికారం కావాల్సింది పేదలకు మంచిచేసి, వాళ్ల గుండెల్లో స్ధానం సంపాదించుకుని, చనిపోయిన తర్వాత వాళ్ల గుండెల్లో, ఇళ్లల్లో బ్రతకాలన్న తపన, తాపత్రయంతో కాదు.. వారికి అధికారం కావాల్సింది దోచుకోవడానికి. దోచుకున్నది పంచుకోవడానికి, పంచుకున్నది తినడానికి. వాళ్ల మాదిరి దోచుకోవడం నా విధానం కాదు..
వాళ్ల మాదిరిగా నాకు ఒక గజదొంగల ముఠా తోడుగా లేదు. వాళ్ల మాదిరిగా నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి తోడుగా లేదు. టీవీ5 అండగా లేదు. వాళ్ల మాదిరిగానాకు ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు. దోచుకుని, పంచుకుని, తినుకోవడం నా విధానం కాదు. నా విధానం.. నేను నమ్ముకున్నది పైన దేవుడిని, ఆ తర్వాత మిమ్మల్నే.
ఇవాళ నేను మీ అందరితో ఒక్కటే చెబుతున్నాను. అటువంటి వాళ్లు చెబుతున్న అబద్దాలు నమ్మకండి. మోసాలు నమ్మకండి. రాబోయే రోజుల్లో వాళ్లు మీ ఇంటికి వస్తారు. వచ్చి ఒక్కో ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. ఒక్కో ఇంటికి ఒక బెంజ్‌ కారు ఇస్తామని కూడా చెబుతారు. ఈ మాటలను, ఈ అబద్దాలను, మోసాలను నమ్మకండి. మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి.
మీ ఇంటిలో మీకు మంచి జరిగి ఉందా ? లేదా ? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికుడిగా నిలబడండి. ఈ రోజు యుద్ధం .. పెత్తందార్లకు, పేదల ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నది. ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు, ప్రతి ఓటు.. పేదవాడిని రక్షించుకోవడానికే వేస్తున్నాం. పేదవాడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు అడుగులు వేస్తున్నాం. ఒక పెత్తందారీ ప్రభుత్వం రాకూడదని అడుగులు వేస్తున్నాం. యుద్ధం పేదవాడికి, పెత్తందార్లకు మధ్య జరగబోతుంది. ఈ యుద్దంలో కులాలు లేవు. మతాలు లేవు. పేదవాడు ఒకవైపు, పెత్తందారు మరోవైపు ఉన్నాడన్నది మాత్రమే గుర్తుపెట్టుకొండి. ఇలాంటి వారితో యుద్ధం జరుగుతుందన్నది అందరూ గుర్తుపెట్టుకొండి. ఇలాంటి ఈ యుద్ధంలో మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మీ బిడ్డ ప్రభుత్వానికి ఉండాలని, దేవుడి దయతో మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం కూడా ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. కాసేపటి క్రితం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీను మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధి పనులు అడిగారు. కరకట్ట ప్రాంతంలో రూ.7 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ అడిగారు. ఇప్పటికే మనం రూ.400 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ కడుతున్నాం. కృష్ణలంక ప్రాంతంలో మీకు కనిపించే ఉంటుంది. ఇందులో భాగంగా దాన్ని పొడిగిస్తూ.. రూ.7 కోట్లు కూడా మంజూరు చేస్తున్నాం. ఎస్సీ సోదరులు కోసం రెల్లి కమ్యూనిటీ హాల్‌ కూడా మంజూరు చేస్తున్నాం. రూ.3.50 కోట్లతో 5 మసీదులు కూడా మంజూరు చేస్తున్నాం. ఎస్సీ శ్మశానవాటిక, కాపు కమ్యూనిటీ హాల్‌ అడిగారు అవి కూడా మంజూరు చేస్తున్నాను.
మీ అందరికీ మంచి జరగాలని మరోసారి ఆకాంక్షిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News