YS Jagan: రాష్ట్రంలో మున్సిపల్, పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణ తీరుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అనేక చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా, పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో మరికాసేపట్లో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
కాగా, రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తే.. ప్రజాస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితమైందని వైఎస్ జగన్ ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని, పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పులివెందులతో పాటు పలు నియోజకవర్గాల్లో కూటమి నేతలు రీ-రిగ్గింగ్, దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్లకు పాల్పడ్డారని విమర్శించారు.
ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలు, అక్రమాలకు సంబంధించిన వీడియోలు, ఆధారాలను సేకరించామని, వీటిపై ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని జగన్ స్పష్టం చేశారు. దాడులకు గురైన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఏజెంట్లకు వైఎస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.

