Montha Politics in AP: ఏపీలో మొంథా పాలిటిక్స్ మొదలయ్యాయి. తుపాను బీభత్సంతో అతలాకుతలమవుతున్న రాష్ట్రంలో రజకీయ రగడ మొదలైంది. ప్రభుత్వం ప్రకటించిన సహాయక చర్యలపై వైసీపీ రాజకీయ విమర్శలకు దిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సాయం గత వైసీపీ ప్రభుత్వం కన్నా చాలా తక్కువగా ఉందని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. రెండు ప్రభుత్వాల హయాంలో అందించిన సాయాన్ని పోలుస్తూ.. ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.
వైఎస్ జగన్ అధికారంలో ఉంటే: వరదల సమయంలో సీఎంగా వైఎస్ జగన్ ఉంటే బాధితులకు రూ.2,000 నుంచి రూ.3,000 నగదుతో పాటు రేషన్ కిట్ ఇచ్చేవారని ఎమ్మెల్యే తాటిపర్తి గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక్కరికి రూ.1,000, కుటుంబానికి రూ.3,000 మాత్రమే ఇస్తున్నారని ఆయన తన ట్వీట్‌లో విమర్శించారు. గతంలో ఇంటి నష్టం, పంట నష్టం, మరణాలకు అందించిన సాయం వివరాలు కూడా ప్రస్తుత సాయం కంటే మెరుగ్గా ఉన్నాయని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రకటించిన సాయం: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది. కుటుంబంలో ఒక్కరే ఉంటే రూ.1,000 ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా పేర్కొంది. బాధితులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ మొత్తాన్ని అందజేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. నగదుతో పాటు నిత్యావసర సరుకుల పంపిణీకి కూడా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ సహాయక చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ కిట్‌లో కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార వంటి సరుకులు ఉంటాయని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 14,415 రేషన్ షాపుల ద్వారా ఈ సాయం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వరదల సమయంలో వైయస్ జగన్ గారు సీయంగా ఉంటే,
₹2,000–₹3,000 + రేషన్ కిట్
ఇంటి నష్టం: ₹10,000–₹1,20,000
పంట నష్టం: ₹5,000–₹10,000/acre
మరణం: ₹5,00,000
సహాయం ఇంటి తలుపువద్దకే.ఇప్పుడు బాబు గారు ఉన్నారు కాబట్టి,
ఒక్కరికి ₹1,000
కుటుంబానికి ₹3,000
నిత్యావసర సరుకులు.— T Chandra Sekhar MLA (@TatiparthiOnX) October 29, 2025


