ఏపీ మాజీ మంత్రి, కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి శస్త్ర చికిత్స జరిగింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో.. కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్ లో చేర్చారు. అన్నిరకాల వైద్య పరీక్షలు చేసిన అనంతరం.. శుక్రవారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలోనే ఉన్నారని, మరో రెండు మూడు రోజులపాటు హాస్పిటల్ లోనే ఉంటారని వైద్యులు తెలిపారు.
కొడాలి నానికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటంతో కొద్దిరోజులుగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, రెండు మూడు రోజుల తర్వాత ఆస్పత్రి నుండి డిశ్చార్జి అవుతారని కుటుంబసభ్యులు, సన్నిహితులు చెబుతున్నారు. రెండు వారాలపాటు ఆయనకు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. 15 రోజుల తర్వాత ఆరోగ్యం సహకరిస్తే.. కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను చేయనున్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు.