Varudu Kalyani NRI Harassment Allegations : రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, ఏకంగా విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐ మహిళలకు కూడా రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
డల్లాస్‌లో ఎన్ఆర్ఐ మహిళపై లైంగిక వేధింపుల కలకలం : విశాఖ పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ… అమెరికాలోని డల్లాస్‌లో ‘ప్యూర్ సర్వీస్ ఆర్గనైజేషన్’ ఫౌండర్, ఎన్ఆర్ఐ డాక్టర్ తాళ్లూరి శైలా అనే మహిళ ఎదుర్కొన్న వేధింపుల ఉదంతాన్ని లేవనెత్తారు. సేవా కార్యక్రమాలకు సంబంధించి మంత్రి అపాయింట్‌మెంట్ కోరిన బాధితురాలిని ఒంటరిగా కాఫీ షాప్‌కు రావాలని ఆ మంత్రి ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. సదరు మంత్రి ఆమెకు అసభ్యకరమైన ఫోటోలు పంపి మానసికంగా వేధించారని, ఆ మంత్రి బారి నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు చివరకు చనిపోయిన తన పెదనాన్న పేరును ఉపయోగించుకోవాల్సి రావడం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలి : అమెరికాలో జరిగిన ఈ దారుణ సంఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఐ మహిళను వేధించిన మంత్రిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని స్పష్టం చేశారు. బాధితురాలు బయటపెట్టిన సోషల్ మీడియా చాట్‌లు, ఫొటోలు, ఫోన్ రికార్డులు తదితర డిజిటల్ ఆధారాలన్నింటినీ స్వాధీనం చేసుకుని సమగ్ర ఫోరెన్సిక్ విచారణ జరిపించాలని కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించని ప్రభుత్వం : బాధితురాలు నేరుగా సమాజహితం కోసం పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఫౌండర్ అయి ఉండి, సాక్ష్యాధారాలతో సోషల్ మీడియా ‘ఎక్స్’ అకౌంట్ ద్వారా ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు గుప్పించింది. బాధితురాలు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి పోస్టులు పెట్టినా కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటన్నారు. న్యాయం చేయాల్సిన ప్రభుత్వం బాధితురాలికి అండగా నిలవకపోగా, అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ద్వారా బాధితురాలిపైనే దుష్ప్రచారం చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
మహిళా మంత్రులు, హోంమంత్రి వైఖరి ఏంటి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 27 నెలల కాలంలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని వరుదు కళ్యాణి ఆరోపించారు. ఈ దారుణంపై హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు మహిళా మంత్రులు సవిత, సంధ్యారాణి తమ వైఖరిని స్పష్టం చేయాలని నిలదీశారు. గతంలో కూటమి ప్రజాప్రతినిధులు అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నజీర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి సంధ్యారాణి పీఏలపై ఆరోపణలు వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే నాయకులు ఇంతలా తెగబడుతున్నారని విమర్శించారు.

