Ysrcp : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చురుకైన జిల్లా నెల్లూరు. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో అంచనా వేయడం కష్టం. తాజాగా, మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ మధ్య ఉన్న వైరం ఇప్పుడు సన్నగిల్లి, తిరిగి ఏకమయ్యారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వీరిద్దరు శత్రువులానే మెలిగారు. ఈ ఇద్దరినీ ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులే కలిపాయన్న చర్చ జరుగుతోంది.
Chandrababu : ఎరువుల ధరలు పెంచితే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు హెచ్చరిక!
వైసీపీ ప్రభుత్వంలో, మొదట అనిల్ కుమార్ యాదవ్‌కు మంత్రి పదవి దక్కడంతో, కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి చెందారు. ఆ తర్వాత కేబినెట్ విస్తరణలో కాకాణికి మంత్రి పదవి వచ్చినప్పటికీ, వారి మధ్య ఉన్న వైరం మాత్రం కొనసాగింది. పార్టీ అధినేత జగన్ స్వయంగా నచ్చజెప్పినా కూడా వారిద్దరూ సఖ్యతగా ఉండలేకపోయారు.
అయితే, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మాజీ మంత్రులైన కాకాణి, అనిల్‌లను కేసులతో టార్గెట్ చేయడం ప్రారంభించింది. మైనింగ్ కేసుల్లో అరెస్టై మూడు నెలలుగా జైలు జీవితం గడిపిన కాకాణి ఇటీవల విడుదలయ్యారు. ఆయన విడుదలైన వెంటనే, ఒకప్పుడు తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఆయన్ను కలిసి పరామర్శించారు.
ప్రస్తుతం అనిల్ యాదవ్‌పై కూడా కేసులు నడుస్తున్నాయి. రేపు ఆయనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో, కాకాణిని కలవడం కేవలం పరామర్శ మాత్రమే కాదని, ఇద్దరి మధ్య తిరిగి రాజకీయ సఖ్యతకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామం వైసీపీ క్యాడర్‌లో మాత్రం సంతోషం నింపుతోంది. ఒకప్పుడు జగన్ మాట వినని ఈ ఇద్దరు నేతలు, ఇప్పుడు ఒకే గొడుగు కిందకు రావడం పార్టీకి కొత్త బలాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు. కేసుల వేధింపులతో కఠిన పరీక్షను ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ ఇద్దరు నేతల ఐక్యత వైసీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.


