HomeTop StoriesYCP: వైసీపీ నేతలపై అరాచకాలు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు: టీజేఆర్‌ సుధాకర్‌బాబు

YCP: వైసీపీ నేతలపై అరాచకాలు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు: టీజేఆర్‌ సుధాకర్‌బాబు

తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా ఖూనీ చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అధికార దుర్వినియోగంతోనే ఎన్నికలు: ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ కలిసి వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఘర్షణలు సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వచ్చిన వ్యతిరేకతను తట్టుకోలేక, బయటి ప్రాంతాల నుంచి గుండాలను తీసుకొచ్చి భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకులను, ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా హౌస్ అరెస్టులు చేస్తూ, నోటీసులు ఇస్తున్న పోలీసులు… టీడీపీ గుండాలు రిగ్గింగ్, బూత్ ఆక్రమణలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా టీడీపీకి తొత్తుగా మారిపోయిందని సుధాకర్‌బాబు ఆరోపించారు. పోస్టింగ్స్, బదిలీల కోసం అధికారులు వృత్తి ధర్మాన్ని పక్కనపెట్టి వైఎస్సార్‌సీపీ శ్రేణులను వేధిస్తున్నారని తెలిపారు.

వైఎస్సార్‌ జిల్లాలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఒక సీఐ స్థాయి అధికారి అడ్డుకోవడం పోలీసులపై ప్రభుత్వ ఒత్తిళ్లకు ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. పాలపర్తిలో ఏజెంట్‌ పత్రాలు చింపివేసినా, పులివెందులలో బీటెక్‌ రవి పోలింగ్‌ బూత్‌లలో ఉండి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. లింగాలలో సాక్షి విలేకరి పుల్లారెడ్డిపై దాడి చేసి ఫోన్‌ ధ్వంసం చేసినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, విలేకరులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా అరాచక పర్వం: గ్రామాల్లో పెట్రోల్‌ బాంబులు వేయించే స్థాయికి చంద్రబాబు రాజకీయాలను దిగజార్చారని మండిపడ్డారు. దర్శి నియోజకవర్గంలో పాలు అమ్ముకునే సామాన్యుడిపై పోలీసుల దౌర్జన్యం, కొత్తపల్లి గ్రామంలో ప్రజల నిరసనలు రాష్ట్రంలోని భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నాయన్నారు.

తిరుపతి జిల్లా నల్లబ్రెడ్డిపల్లెలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు లాగేశారని, అనంతపురం, నంద్యాల, సత్యసాయి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో బూత్ ఆక్రమణలు జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధైర్యంగా ఎదుర్కొంటాం: గతంలో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికలను పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారని గుర్తుచేశారు. కానీ నేడు చంద్రబాబుకు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేక అధికార బలంతో ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ దౌర్జన్యాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు, మహిళా నాయకురాళ్లు ధైర్యంగా ఎదుర్కొంటున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వెంటనే ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News