Protest In AP YCP: పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 3 వరకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ రోజు రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఇంధన ధరలు పెరిగాయని, ఈ పెంపు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రైతులు, రవాణారంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు మాటమార్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి.- సజ్జల రామకృష్ణారెడ్డి
Also Read: https://teluguprabha.net/sports-news/royal-challengers-bangalore-beat-punjab-kings-by-23-runs/
కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సోమవారం అన్ని ప్రాంతాల్లో నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పెరిగిన ధరల వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని ఆరోపించారు.
కారణాలివే..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో చమురు రవాణాకు అంతరాయం కలగడం వల్ల దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను లీటరుకు రూ. 3 వరకు పెంపును అమలు చేశాయి.
కాగా, ప్రస్తుతం దేశంలోని మెట్రో నగరాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్, ఇతర సెస్సుల కారణంగా ఇక్కడ రేట్లు సెంచరీ మార్కును దాటుతున్నాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ. 113.03 కి చేరుకోగా.. తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ. 110.89 గా నమోదైంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 97.77 గా ఉంది.

