YSRCP: ఈసారి 175 సీట్లకు 175లో మనమే గెలవాలి. ఆ అవకాశం కూడా మనకి ఉంది. జస్ట్ మీరు మన పరిపాలన గురించి ఇంటింటికి తిరిగి వాళ్ళకి తెలియజెప్పాలి. అప్పుడే మన పాలన గురించి ప్రజలు ఆలోచిస్తారు. వాళ్ళ దగ్గరకి వెళ్తే వాళ్ళ సమస్యలు చెప్తారు కనుక ఆ సమస్యలను తీరిస్తే విజయం మనదే అవుతుంది. ఇవీ.. సీఎం జగన్ ప్రతిసారి పార్టీ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెప్పే మాట. దాని కోసమే జగన్ గడపగడపకు అనే ఓ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపారు.
ఇక, గడపగడప కార్యక్రమానికి వస్తున్న స్పందనతో ఎమ్మెల్యే, మంత్రులు సైతం ఎక్కడివాళ్ళు అక్కడే సర్దుకున్నారు. మంత్రులు అని కూడా చూడకుండా కొన్నిచోట్ల ప్రజలు తిరుగుబాటు చేశారు. కానీ.. అవన్నీ సీఎం వద్ద చెప్పుకొనే పరిస్థితి లేకపోవడంతో వాళ్లలో వాళ్లే మధనపడుతూ సాగిపోతున్నారని పార్టీలో ఇన్నర్ టాక్. అయితే, సీఎం జగన్ మాత్రం వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలుపుపై వందకు వంద శాతం ధీమాగా ఉన్నారు.
ఈ ధీమాకి కారణం రెండే రెండు అంశాలని విశ్లేషకుల మాట. అందులో ఒకటి సంక్షేమం.. రెండు మూడు రాజధానులు. ఔనన్నా.. కాదన్నా.. అప్పులు చేసైనా.. ఉద్యోగులకు జీతాలు ఆపైనా సంక్షేమ పథకాలకు లోటు రాకుండా చేస్తున్నారు. అక్కడక్కడా వాలంటీర్లు, లోకల్ లీడర్లు రాజకీయాలతో సంక్షేమానికి చెడ్డపేరు తెస్తున్నారు కానీ సీఎం మాత్రం అన్నిటిని వదిలేసి ఒక్క సంక్షేమ మీదనే దృష్టి పెట్టారు. ఒక్కొక్కరికి ఇంత లెక్కన అందరికీ డబ్బు పంచుతున్నారు. ఇప్పుడు ఈ సంక్షేమమే తనని వచ్చే ఎన్నికలలో గెలుపు తీరాలకి చేర్చుతుందని ఆశపడుతున్నారు.
రెండో అంశం.. మూడు రాజధానులు. దానికే కట్టుబడి ఉన్నామని సీఎం నుండి ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎప్పుడు అంటే మాత్రం ఎవరి దగ్గర స్పష్టత లేదు. కానీ.. ఇది సరిగ్గా ఎన్నికలకు ముందు అస్త్రంగా వాడనున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు రాజధాని తెస్తా అంటుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని బలమైన రీజన్ గా ఉపయోగపడనుంది. ఒకవిధంగా ప్రతిపక్షాలు కూడా దీనిని తిప్పికొట్టేందుకు కాస్త పడాల్సి ఉంటుంది. ఈ రెండు ఎంతవరకు విజయం అందిస్తాయో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటి ఆశలతో ఉన్నట్లుగా కనిపిస్తుంది.