Kodali Nani Faces New Case for Insulting Chandrababu, Lokesh: వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కొత్త కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన ఆరోపణలపై.. కొడాలి నానిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ ఫిర్యాదును విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ లా కాలేజీ విద్యార్థిని అంజనప్రియ 2024లో త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ఆమె తన ఫిర్యాదులో.. కొడాలి నాని అధికారంలో ఉన్న సమయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు, తిట్లు.. ఒక మహిళగా తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా.. విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ రమణయ్య ఆధ్వర్యంలో ఐటీ యాక్ట్ సెక్షన్లు 353(2), 352, 351(4) కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసుపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని నివాసానికి పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని 41 సీఆర్‌పీసీ నోటీసులు అందించారు. కాగా, కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తన రాజకీయ వ్యాఖ్యలు, వివాదాస్పద మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుండేవారు.


