Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Yuvagalam: ప్రజలతో మమేకమై మాట్లాడిన లోకేష్

Yuvagalam: ప్రజలతో మమేకమై మాట్లాడిన లోకేష్

టిడిపి రాష్ట్ర కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజలు సమస్యలతో ఘన స్వాగతం పలుకుతూ పాదయాత్రను బ్రహ్మరథం పట్టారు. ఆదోని మండలంలోని పెద్ద పిండేకల్ గ్రామంలో ప్రవేశించారు లోకేష్ .పెద్ద పెండేకల్ గ్రామం మీదుగా ఆరెకల్ గ్రామం నుంచి పాదయాత్ర కొనసాగిస్తూ మధ్యాహ్నం నాగలాపురం గ్రామ పొలాల్లో మధ్యాహ్న భోజన విరామం తీసుకున్నారు. ఎక్కడ చూసినా పూల వర్షం కురిపిస్తూ సమస్యలను లోకేష్ వివరిస్తూ పాదయాత్రను ఘనంగా కొనసాగించారు. ఎర్రటి ఎండలో వేడిని సైతం లెక్కచేయకుండా అధికార వైసిపిపై ఉన్న వ్యతిరేకతతో యువకులు,వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో మేము సైతం అంటూ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము చెప్పింది, చేసిందే వేదం అంటూ నియంత వైఖరితో పాలన కొనసాగిస్తున్నారని లోకేష్ నాయుడు దృష్టికి ప్రజలు తీసుకువెళ్లారు.

- Advertisement -

ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రజలను వేడుకొని అధికారం చేజిక్కించుకున్న తర్వాత భూ కబ్జాలు, దందాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, అక్రమ కేసులు, భౌతిక దాడులు చేయించడంలో అభివృద్ధి చెందిందే తప్ప రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానించారు. పేదోడి కడుపు కొడుతూ ఉన్నోడి కడుపు నింపేది జగన్ ప్రభుత్వం అని మండిపడ్డారు. రాష్ట్ర స్థితిగతులు ఇప్పటికే తారుమారవుతున్నాయని సైకో పోవాలి సైకిల్ రావాలి అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలకు చెప్పుకొచ్చారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు యువగళంకు తరలివచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తతో పలు సౌకర్యాలను కల్పించారు.

ఎన్ఆర్ఈజీఎస్ వేతనాలు కూడా సీఎం జగన్ వదిలిపెట్టలేదని లోకేష్ విమర్శించారు. 261 కోట్లు ఉపాధి హామీ బిల్లులు దుర్వినియోగం జరిగిందని కేంద్ర ప్రభుత్వం తెల్చి చెప్పిందన్న విషయాన్ని గుర్తుచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ సమస్యలపై కేంద్రంతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.

వాల్మీకుల హక్కులు కాపాడాలని విజ్ఞప్తి
ఆరేకల్ లో వాల్మీకి సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వాల్మీకుల హక్కులను కాపాడాలని విన్నవించారు. రాష్ట్రంలో 40లక్షల మంది వాల్మీకులు ఉన్నారని, 1956 వరకు ఎపిలో వాల్మీకిలు ఎస్టీ జాబితాలోనే కొనసాగారని, ఆ తర్వాత మైదాన ప్రాంతంలో ఉన్నవారిని బిసిలుగా, ఏజన్సీ ప్రాంతంలో ఉన్న వారిని ఎస్టీలుగా విభజించిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం కొన్నిజిల్లాల్లో వాల్మీకిలను మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసిందని చెప్పుకొచ్చారు.వాల్మీకి,బోయలకు టిడిపి అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.కాల్వ శ్రీనివాసులును ఎంపిగా, రాష్ట్రమంత్రిగా చేసింది టిడిపినే అని గుర్తు చేశారు.ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని తెలిపారు.చేసిన తీర్మానం కేంద్రం వద్ద ఉండగా, జగన్ ప్రభుత్వం మరో అసంబద్ధమైన తీర్మానం చేసి పంపడంలో అంతర్యమేమిటో వాల్మీకులంతా గమనించాలన్నారు. వాల్మీకులకు న్యాయం చేసేది టిడిపి మాత్రమే అన్నారు.

లోకేష్ తో పాటు పాదయాత్రలో నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ గుడిసి కృష్ణమ్మ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఉమాపతి నాయుడు, దేవేంద్రప్ప, రామస్వామి, ఫక్రుద్దీన్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News