Minister Narayana: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మను ఉద్దేశించి మంత్రి నారాయణ చేసినట్లుగా ప్రచారమైన ‘జీరో’ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో, ఎట్టకేలకు ఇద్దరు నేతలు దీనిపై స్పష్టతనిచ్చారు. విశాఖపట్నంలో మంత్రి నారాయణతో కలిసి పర్యటించిన వర్మ.. ఈ వివాదంపై మీడియాతో మాట్లాడారు.
మంత్రి నారాయణ ఏమన్నారు?
“పిఠాపురంలో సమస్యలు జీరో చేశామంటే, దాన్ని ‘వర్మను జీరో చేశామని’ మార్చి ప్రచారం చేశారు. నా వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించడం, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం” అని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ చాలా ఐక్యంగా, కలిసికట్టుగా ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య ఎలాంటి విభేదాలూ లేవని, మొత్తం కూటమి దృఢంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతు
మంత్రి నారాయణ వివరణకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే వర్మ, ఈ ప్రచారాలను ఖండించారు. “పిఠాపురంలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు. పేటీఎం బ్యాచ్ చేస్తున్న అసత్య ప్రచారాలను, తప్పుడు కథనాలను మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ కూటమి ఐక్యతను దెబ్బతీయాలని చూసే శక్తుల కుట్రలకు తాము లొంగబోమని ఇరువురు నేతలు స్పష్టం చేయడంతో, పిఠాపురం రాజకీయాల్లో రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడింది.


