రాష్ట్రంలో పూర్తీగా దెబ్బతిన్న శాంతి భద్రతలను మళ్లీ గాడిలో పెడతామని, నేర రహిత సమాజమే లక్ష్యంగా అడుగులు వేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమున్నా మొదట చేయాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడి వారి ఆస్తులకు భరోసా ఇవ్వాలని, కానీ గడిచిన ఐదేళ్ల పాటు శాంతి భద్రతలను గాలికొదిలేశారని అన్నారు. శాసనసభలో గురువారం శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో జరిగిన దారుణాలపై గత ఐదేళ్ల తన ఆవేదన ఆవిష్కృతం చేసేలా సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ….‘‘దేశంలోనే ఏపీ పోలీసులకు ఒక ప్రత్యేకత ఉంది. సమైఖ్య రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సమర్థవంతంగా నడిపించాం. ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండేది…ఫ్యాక్షన్ ను అణచివేడయడానికి సమర్థవంతమైన అధికారులను నియమించాం. సీమలో ప్యాక్షన్ లేకుండా చేయాలన్న సంకల్పంతో పని చేశాం. రాజకీయంగా వేధిస్తున్నారన్న మాట కూడా రాకుండా ఉండేందుకు మొదట మా ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన తర్వాత మిగతావారిని అరెస్టు చేశాం. తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. హైదరాబాద్ లో ఆరు నెలలు పాటు కర్ఫ్యూ ఉండేది. కనీసం నిత్యావసర వస్తువులు కూడా దొరకేవి కాదు. కానీ మత ఘర్షణలపై ఉక్కుపాదం మోపాం. తర్వాత పెట్టుబడులు వచ్చాయి..ఉపాధికి నెలవుగా మారింది. నక్సలిజాన్ని ఎదుర్కొనేందుకు సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యూహలు రచించాం. నాపై బాంబు దాడి చేసినా భయపడలేదు. రౌడీ అనే పేరు వినబడటానికే భయపడేలా పీడీ యాక్ట్ పెట్టి అణచివేశాం.’’ అని తెలిపారు.
నాడు మేం తీసుకున్న చర్యలతో అదుపులో నేరాలు
‘‘2014-19 మధ్య శాంతి భద్రతలను కాపాడటం కోసం తీసుకున్న చర్యల వల్ల హత్యలు 15 శాతం, అల్లర్లు 51 శాతం, కిడ్నాప్ లు 16 శాత తగ్గాయి. దాడులు 20 శాతం, వేధింపులు 11 శాతం, దోపిడీలు 25 శాతం తగ్గించాం. ప్రభుత్వ చర్యలతో ప్రజల భద్రతను పెంచడంతో ప్రతి ఒక్కరిలో నమ్మకం వచ్చింది. ఇవి సాధించడానికి సాంకేతికతను ఉపయోగించాం. విభజన తర్వాత మోడల్ డీజీపీ ఆఫీసును నిర్మించాం. రాష్ట్రంలో 14,770 ఆటోమేటిక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పోలీసులకు బాడీ ఓర్న్ కెమెరాలు అమర్చి దూషణలు, పరుషంగా ఎవరు మాట్లాడినా చర్యలు తీసుకున్నాం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడితే వాటినుండి అలెర్ట్ చేయడానికి కెమెరాలు ఏర్పాటు చేశాం. ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని తీసుకొచ్చి నేరాలు తగ్గించాం. కానీ 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం చీకటి పాలనను తలపించింది. ఎమర్జెన్సీలో కూడా లేనంతగా అందరినీ ఇబ్బందులు పెట్టారు. ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారు. శాసన వ్యవస్థ, కార్య నిర్వహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలపైనా, మీడియాపైనా దాడులు చేశారు. ఇదే సభలో గత ప్రభుత్వంలో దూషణలు చేయడంతో పాటు సభ్యులపై దాడులకు పాల్పడ్డారు. నన్ను కూడా అవమానించడంతో సభ నుండి నిష్క్రమించి గౌరవ సభగా మార్చిన తర్వాతే వస్తానని చెప్పాను. అందుకే మళ్లీ గౌరవసభకు ముఖ్యమంత్రిగా వచ్చా. మండలికి 3 రాజధానుల బిల్లు పంపినప్పుడు ఛైర్మన్ పై మాటల దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ప్రభుత్వ కక్షసాధింపులకు పోలీసులను ఆయుధంగా మార్చుకున్నారు. వైసీపీ నేతలతో కుమ్మక్కైన వారికి నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు ఇచ్చారు. వైసీపీ నేతల అక్రమాలకు సహకరించని వారిని సుధీర్ఘకాలం వీఆర్ కు పంపారు. వారి దుర్మార్గాలపై విభేదిస్తే పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఐదేళ్లపాటు వీఆర్ లో ఉన్న కొందరు అధికారులను గత ప్రభుత్వంలో మనం చూశాం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను విధ్వంసం చేశారు.’’ అని సీఎం అన్నారు.
ఒక్క కేసు కూడా లేని నాపై కక్షతో 17 కేసులు పెట్టారు
‘‘ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు, నాయకులు. చిన్న పార్టీని కూడా విమర్శించాలన్నా, చిన్న నాయకుడిపై దాడి చేయాలన్నా గతంలో భయపడేవారు. గత ఐదేళ్లలో నాపై 17 కేసులు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేయడానికి వెళ్లినప్పుడు తప్ప నాపై ఒక్క కేసు కూడా లేదు. అలాంటిది 2019లో అధికారంలోకి రాగానే నా ఇంటిపై డ్రోన్ ఎగురవేశారు. ఛలో ఆత్మకూరుకు పిలుపునిస్తే ఇంటిగేటుకు తాళ్లు కట్టారు. పవన్ కల్యాణ్ పై 7 కేసులు పెట్టారు. నోటీసులు ఇచ్చి విశాఖపట్నం నుండి బలవంతంగా పంపేశారు. నన్ను అరెస్టు చేసిన సమమంలో రాష్ట్రానికి వస్తుంటే రానివ్వకుండా సరిహద్దులో అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వకుండా ఇబ్బందులు పెడుతుంటే బోండా ఉమా, బుద్ధా వెంకన్న వెళ్లారు…వారిపై దాడి చేస్తే తప్పించుకుని వచ్చారు. యువగళం పాదయాత్రలో లోకేష్ కు మైకు ఇవ్వకుండా, బెంచి ఎక్కనివ్వకుండా ఇబ్బందులు పెట్టారు. పాదయాత్ర సాగనివ్వకుండా ఉండేందుకు రాజమండ్రి వద్ద గోదావరి బ్రిడ్జి మూసేశారు. పల్లా శ్రీనివాస్ రావుకు చెందిన బిల్డింగును అక్రమంగా కూల్చేశారు. అందుకే ప్రజలు ఆదరించి పల్లా శ్రీనివాసరావుకు 95 వేల మెజారిటీ ఇచ్చారు. వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లను అరెస్టు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ప్రభుత్వ అధికారులపై దాడులు చేశారని కూన రవికుమార్ పై కేసులు పెట్టారు. గౌతు శిరీష, పంచుమర్తి అనురాధపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు.’’ అని సీఎం అన్నారు.
పల్నాడు పులి కోడెలను వేధించి ప్రాణాలు తీశారు
‘‘పల్నాడు పులిగా పిలుచుకునే కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టి వేధించారు. ప్రభుత్వ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసులు పెట్టారు. ఈ మాజీ సీఎంను నేను అడుగుతున్నా….నీ ఇంట్లో ఇప్పుడు కూడా ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది కదా…దానికి ఏం సమాధానం చెప్తావు.? కనీస సంప్రదాయం పాటించకుండా కేసులుపై కేసుల పెట్టి వేధించడంవల్ల అవమానంతో కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. దళిత మహిళ అత్యాచారానికి గురై హత్యగావించబడితే వంగలపూడి అనిత, ఎంఎస్ రాజు పులివెందుల వెళ్లి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే వారిపైనా అట్రాసిటీ కేసు పెట్టారు. అయ్యన్నపాత్రడుపైనా రేప్ కేసు పెట్టారు. అక్రమ మైనింగ్ పై ప్రశ్నించినందుకు దేవినేని ఉమాపై కేసులు పెట్టారు. రామతీర్థంలో రాముడి తల తీశారు… దాన్ని ప్రశ్నించినందుకు అశోక్ గజపతిరాజుపై కేసులు పెట్టారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడుని 600 కి.మీ తిప్పి జైల్లో పెట్టారు. ప్రశ్నాపత్రం లీక్ అంటూ అపోహలు సృష్టించి మంత్రి నారాయణపైనా కేసులు పెట్టి వేధించారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. లాకప్ లో దారుణంగా కొట్టి, ఆ వీడియోలు చూసి పైశాచిక ఆనందం పొందారు. ఒక ఎంపీని ఐదేళ్ల పాటు నియోజకవర్గానికి వెళ్లకుండా చేశారు. పీఎం పాల్గొనే సభకు రైలులో వెళ్తుంటే రఘురామకృష్ణరాజు ప్రయాణించే భోగీని కూడా పెట్రోలు పోసి తగలబెట్టాలని చూశారు. పట్టాభి కాళ్లపై కొట్టారు, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటిపై దాడి చేసి ఇల్లు తగలబెట్టి ఆయనపైనే కేసులు పెట్టారు. నా ఇంటిపైకి దాడి చేయడానికి జోగి రమేష్ వచ్చాడు. పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తే నా ఇంటికి అపాయింట్మెంట్ కోసం వచ్చానని చెప్పాడు. పుంగనూరుకు చెందిన రామచంద్రయాదవ్ ఇంటిపై పెద్దిరెడ్డి మనుషులు దాడి చేసి విధ్వంసం సృష్టించి ఆయన కార్లు అన్నీ పగలగొట్టారు. విజయవాడలో టీడీపీ నేత గాంధీపై దాడి చేసి కన్ను పోగొట్టారు. అమరావతిలో నాపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు…ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటన స్వేచ్ఛ హక్కు ప్రకారం నిరసన తెలిపే హక్కు ఉందని నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాలపైన, టెక్కలిలో జనసేన కార్యాలయంపైనా దాడి చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతికి గత ఐదేళ్లలో శ్రీకారం చుట్టారు.’’ అని సీఎం అన్నారు.
టీడీపీ కార్యకర్తలను ఊచకోత కోశారు
‘‘తోట చంద్రయ్యను పట్టపగలే అందరూ చూస్తుండగానే పీక కోసి చంపారు. జై జగన్ అంటే వదిలేస్తామని చెప్తే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు తప్ప రాజీపడలేదు. కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్యను నరికి చంపారు. పల్నాడులో వెంకటలక్ష్మీ, శేషగిరిరావు, మాణిక్యం అనే వ్యక్తులపై మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి దాడులు చేశారు. వినుకొండలో వాళ్ల పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు గంజాయి మత్తులో కొట్టుకుని చనిపోయారని వాళ్ల మాజీ ఎమ్మెల్యేనే చెప్పారు. కానీ దానిపై జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేశారు. టీడీపీ కార్యకర్తలను అంతమందిని హత్య చేస్తే ఏనాడైనా సమీక్ష చేసిన సందర్భాలు ఉన్నాయా.? శాంతి భద్రతలు కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత.’’ అని సీఎం హామీ ఇచ్చారు.
టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై తప్పుడు కేసులు
‘‘నాడు మేం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మా కార్యకలాపాలను అణచివేయడానికి జీవో-1 తీసుకొచ్చారు. ఇంట్లో నుండి బయటకు రాకుండా గృహ నిర్భంధం చేశారు. టీడీపీ నేతలపై 591 కేసులు పెట్టి 162 మంది నేతలను అరెస్టు చేశారు. 1,969 కేసులను పార్టీ శ్రేణులపై పెట్టి 2,370 మంది శ్రేణులను అరెస్ట్ చేశారు. పార్టీ నేతలు, శ్రేణులపై 2560 కేసులు పెట్టారు. జనసేన నేతలపై 24 కేసులు, పార్టీ శ్రేణులపై 181 కేసులు పెట్టి 71 మందిని అరెస్టు చేశారు. బీజేపీకి చెందిన 16 మంది నేతలపై కేసులు, శ్రేణులపై 57 కేసులు పెట్టి 31 మందిని అరెస్టు చేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, అన్ని పార్టీల వారిపై కేసులు పెట్టారు.’’ అని సీఎం వివరించారు.
టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు…వేధింపులు
‘‘టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై అత్యధికంగా 66 కేసులు పెట్టి 46 సార్లు అరెస్టు చేశారు. చింతమనేని ప్రభాకర్ పై 45 కేసులు పెట్టి 15 సార్లు అరెస్టు చేశారు. పులివర్తి నానిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇలా సుమారు 53 మంది నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారు. పవన్ కల్యాణ్ పైనా 7 కేసులు పెట్టారు. మంత్రి నారాయణ అల్లుడు, కూతురు, భార్యపైనా కేసులు పెట్టి విచారణ పేరుతో వేధించారు. ఆఖరికి ఆయన చెల్లెలిపైనా కేసులు పెట్టారు. రాజకీయ పోరాటం చేసిన వారందరిపై కేసులు పెట్టారు… గత ప్రభుత్వంలో అక్రమ కేసులకు గురైన వారందర్నీ ప్రజలు ఇప్పుడు అసెంబ్లీకి పంపించారు. రాష్ట్రంలో ఎవరూ వ్యాపారాలు చేయడానికి, మాట్లాడానికి అవకాశం లేకుండా చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది…అవినీతితో వాటిని పట్టించుకోలేదు. దీంతో వాటిని సందర్శించేందుకు పర్యటన చేపట్టా. అంగళ్లులో ఒక ప్రాజెక్టును పూర్తి చేయకుండా అవినీతికి పాల్పడ్డారు. దాన్ని సందర్శించడానికి వెళ్తే మాపై కర్రలు, రాళ్లతో దాడి చేసి మాపైనే కేసులు పెట్టారు. పుంగనూరులో 7, అంగళ్లులో 6 కేసులతో 490 మందిపై కేసులు పెట్టారు. ఇతరులు అని పెట్టి ఇష్టం వచ్చిన వారిని అరెస్టు చేశారు. ఆ రెండు నియోజకవర్గాల్లో వందలాది మందిపై కేసులు పెట్టి జైలుకు పంపారు.’’ అని సీఎం బాధను వ్యక్తం చేశారు.
ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు మాఫీ చేస్తాం
‘‘కరోనా సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా ముద్రవేసి చంపేశారు. మాజీ జడ్జి రామకృష్ణను ఇబ్బందిపెట్టారు…సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా పదవీ విరమణ చేసే రోజున ఉద్యోగంలో చేర్చుకున్నారు. బకాయిలు అడిగిన కానిస్టేబుల్ ను ఉద్యోగం నుండి తొలగించారు. సీపీఎస్ రద్దు కోసం పోరాడిన 4 వేల మందిపైన కేసు పెట్టారు. ఉద్యోగులపైన గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు అన్నీ సమీక్ష జరిపి ఆ కేసులను మాఫీ చేస్తాం. టీచర్లను బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టడమేకాకుండా వాళ్ల చేత చివరకు టాయిలెట్లు కూడా కడిగించారు.’’ అని సీఎం గుర్తు చేశారు.
న్యాయమూర్తులనూ వదల్లేదు
ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని ప్రశ్నించినందుకు హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పోస్టులు పెట్టిన వారిని శిక్షించేందుకు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చినా కేసు ముందుకు సాగనివ్వలేదు. మీడియాపైనా ఆంక్షలు పెట్టి మీడియా సిబ్బందిపైనా కేసులు పెట్టారు. రామోజీరావుపై సీఐడీ కేసులు పెట్టి హెలికాప్టర్ లో ఎత్తుకెళ్లాలని చూశారు. కానీ ఆయన ధర్మంగా పోరాడారు. అనేక ప్రభుత్వాలను రామోజీరావు విమర్శించి, ప్రశ్నించారు. నన్ను కూడా ప్రశ్నించి, విమర్శలు చేశారు..కానీ ఏనాడూ మేము దాడులకు ఉపక్రమించలేదు. టీవీ5, ఏబీఎన్ ప్రతినిధులపైనా కేసులు పెట్టారు. చరిత్రలో మొదటి సారిగా ఈనాడు కార్యాలయంపై పాణ్యంలో దాడులు చేశారు. రంగనాయకమ్మ అనే వృద్ధురాలు ఎల్జీ పాలిమర్స్ ఘటనపై పోస్టు పెట్టినందుకు కేసు పెట్టారు. ఆస్తులపై దాడి చేయడంతో ఆమె వాటిని అమ్ముకుని హైదరాబాద్ వెళ్లారు. ఎన్నో ఏళ్లుగా నడుపకున్న హోటలో ను మళ్లీ ఆమెకే ఇప్పించాం. తన సమస్యను చెప్పుకోనివ్వకుండా ఆరుద్ర అనే మహిళను వేధించారు…మన ప్రభుత్వం రాగానే ఆమెను ఆర్థికంగా ఆదుకున్నాం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే 2,950 మందిపైన అక్రమ కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీలపైనా దాడులు చేశారు. చీరాలలో కిరణ్ అనే యువకుడు మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపారు. రాజానగరంలో ఇసుక తవ్వకాలపై ప్రశ్నించినందుకు శిరోముండనం చేశారు. గురజాలకు చెందిన దోమతోటి విక్రమ్ అనే వ్యక్తిని హైదరాబాద్ నుండి పిలిచి మరీ చంపారు. మద్యంపై ప్రశ్నించిన పుంగనూరు యువకుడు ఓంప్రతాప్ ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు. దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబునైతే, ఆయన జైలు నుండి విడుదల కాగానే ఊరేగించారు. తన అక్కను వేధిస్తున్నారని అడిగిన అమర్నాథ్ గౌడ్ అనే బాలుడుని పెట్రోలు పోసి చంపేశారు…ఈ ఘటనలన్నింటిపై నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు.’’ అని సీఎం అన్నారు.
లేని దిశ చట్టంతో భ్రమలు
‘‘కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపైన ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. విజయవాడలో యువతిని 11 కత్తిపోట్లు పొడిచి చంపారు. మాజీ సీఎం ఇంటి సమీపంలోని సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేదు. దిశ చట్టం అంటూ లేని చట్టాన్ని ఉన్నట్లు ప్రచారం చేశారు. దిశ చట్టంలో లోపాలున్నాయని కేంద్రం తిరిగి పంపితే, ఇక ఆ తర్వాత మళ్లీ దాని గురించి పట్టించుకోలేదు. లేని చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు పెట్టి యాప్ డౌన్లోడ్ చేయించారు. ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే దిశ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేస్తామని చెప్పిన వ్యక్తి ఒక్కరికైనా వేశారా.?’’ అని సీఎం చంద్రబాబు నిలదీశారు.
ఐదేళ్ల పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దమనకాండ
‘‘ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులకు తెగబడ్డారు. ఎస్సీలు 192 మంది, ఎస్టీలు 58 మంది హత్యకు గురయ్యారు. ఐదేళ్లలో 2,027 మంది మహిళలు హత్యకు గురయ్యారు. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు చెప్పారు. మైనార్టీలపైనా దాడులకు పాల్పడ్డారు. అబ్దుల్ సలాం కుటుంబ ఘటన కంటే ఘోరమైన సంఘటన రాష్ట్రంలో మరొకటి ఉంటుందా. దొంగతనం నెపం వేసి వేధించడంతో కుటుంబం అంతా రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకుంది. నరసరావుపేటలో వక్ఫ్ ఆస్తులు కాపాడాలని కోరిన ఇబ్రహీంను నడిరోడ్డుపై చంపారు. పలమనేరులో మిస్బా అనే 10వ తరగతి విద్యార్థిని బాగా చదువుతుంది. వైసీపీ నేత కూతురు కంటే చదువులో ముందంజలో ఉందని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. మైనారిటీ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛలేకుండా చేశారు. అమరావతి రైతుల ఆందోళలను అణచివేశారు. అమరావతి రైతుల్లో 269 మందిపైన క్రిమినల్ కేసులు పెట్టారు, 2,525 మంది రైతులను అరెస్టు చేశారు. న్యాయస్థానం-దేవస్థానం కార్యక్రమంతో తిరుపతికి పాదయాత్రకు వెళ్తే అడ్డంకులు సృష్టించి చివరకు రైతులు తినే అన్నంలో కూడా ఇసుక పోశారు. అరసవెళ్లికి పాదయాత్రగా వెళ్తుంటే అడ్డుకుని వెనక్కి పంపారు. మహిళలు స్నానాలు చేసే గదులపైన డ్రోన్ లు ఎగురవేశారు.’’ అని వివరించారు.
జగన్ పర్యటనకు వస్తే ప్రజలు, పర్యావరణానికి నరకం
‘‘జగన్ జిల్లా పర్యటనకు వస్తే ప్రజలు, పర్యావరణానికి నరకం కనబడేది. పరదాలు కట్టడం చెట్లు నరకడం, గృహ నిర్బంధాలు చేశారు. ఆడపిల్లలు నల్ల చున్నీలు వేసుకుని జగన్ సభకు వెళ్తే వారి చున్నీలు తొలగించారు. వీధుల్లో భారీకేడ్లు కట్టి షాపులన్నీ మూసేయించేవారు. మనం ప్రజలకు సేవకులుగా ఉందాం…పెత్తందారులం కాదు. మనం ఎంత సింపుల్ గా ఉంటే అంత ఆదరిస్తారు. మీ అందర్నీ కోరుతున్నా…చిన్న చెడ్డపేరు రాకుండా చూడాలి. దేవాలయాలపై రహస్య అజెండాతో దాడులు చేశారు. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని తగలబెట్టారు. విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేశారు. రామతీర్థంలో రాముడి తల నరికారు. మంత్రాలయంలో నరసింహస్వామి తల ధ్వంసం చేశారు. దేవాలయాలకు, మసీదులు, చర్చిలకు అపవాదు రాకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది.’’ అని సీఎం హామీ ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసతో ఏకగ్రీవం
‘‘ఎన్నికల్లో అక్రమాలు, హింస, దాడులకు పాల్పడ్డారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించారు. స్థానిక సంస్థల్లో అన్నింటినీ ఏకగ్రీవం చేసుకోవాలని చూశారు. గ్రామ పంచాయతీలను ఎప్పుడూ లేని విధంగా 2,179 ఏకగ్రీవం చేసుకున్నారు. మున్సిపల్ వార్డులు 577 ను, ఎంపీటీసీలు 2,333, జడ్పీటీసీలు 122 ఏకగ్రీవం చేసుకున్నారు. అన్ని చోట్ల ఇష్టానుసారంగా ఓట్లు గుద్దుకున్నారు. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాం. నా రాజకీయ జీవితంలో ఇలాంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదు.’’ అని సీఎం అన్నారు.
వివేకా హత్యలో ఊహకందని డ్రామాలు
‘‘వివేకానందరెడ్డిని 2019 ఎన్నికల ముందు దారుణంగా హత్య చేశారు. మొదట సాక్షిలో గుండెపోటు అని ప్రచారం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా భారతి తండ్రి గంగిరెడ్డి ఆసుపత్రి నుండి సిబ్బందిని తీసుకొచ్చి రక్తం శుభ్రం చేసి శవానికి కుట్లు వేశారు. పులివెందులకు జగన్ సాయంత్రం వరకూ రాలేదు. ఎన్నికల సమయంలో కేసు వివరాలు బయటకు వెళ్లడించొద్దని కోర్టు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ వద్దని కోర్టులో వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. విచారణ చేసే సీబీఐ అధికారిపైన కేసులు పెట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు కర్నూలుకు వస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయని అడ్డుకున్నారు. సొంత బాబాయి కేసులోనే ఇలా జరిగిందంటే సామాన్యులు పరిస్థితి ఏంటి. 2019 ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడారు…మొన్నటి ఎన్నికల ముందు గులకరాయి డ్రామా ఆడారు. ఏదో ఒకటి చేయించుకుని సానుభూతితో అధికారంలోకి రావాలని చూశాడన్న అనుమానం కూడా నాకు వచ్చింది. దుర్మార్గులు ఆడే డ్రామాలకు ప్రజాస్వామ్యం బలైపోతుంది. ఏమీ తెలియని కుర్రాడిని కేసులు పెట్టి వేధించారు.’’ అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి
‘‘దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉన్నాయి. ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా గంజాయి దొరుకుతోంది. ఏదైనా కంట్రోల్ చేయొచ్చు కానీ…డ్రగ్స్ కు అలవాటు పడ్డవారిని గాడిన పెట్టడం చాలా కష్టం. గత ప్రభుత్వం ఒక్కసారైనా దీనిపై సమీక్ష చేసిందా. గంజాయిపై ఇప్పటికే కమిటీ వేశాం. గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం. గంజాయి సాగు చేసే వారిని కోరుతున్నా…మీ ఆదాయం కోసం గంజాయి పండించి సమాజానికి నష్టం చేయొద్దు. గంజాయి, డ్రగ్స్ పై సదస్సులు పెట్టి ప్రజల్లో అవగాహన తీసుకొస్తాం.’’ అని సీఎం అన్నారు.
నేరస్తుడే ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు చూశాం
‘‘గతంలో నేరస్తులను రాజకీయ పార్టీలు, నేతలు సపోర్టు చేయాలంటే భయపడేవారు. కానీ నేరస్తుడే పార్టీ అధినేతగా ఉంటే, ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు అదే జరిగింది. మాఫియాను పెంచి పోషించారు. చరిత్రలో జగన్ లాంటి నాయకుడ్ని చూశారా.? నా జీవితంలో ఎక్కడా జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు. చరిత్రలో పాబ్లో ఎస్కోబార్ అనే వ్యక్తి కొలింబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్…ఇతను కూడా రాజకీయ నాయకుడు అయ్యారు. డ్రగ్స్ అమ్మడానికి ఏకంగా కారిడాన్ ఏర్పాటు చేశాడు. డ్రగ్స్ విక్రయించి 30 బిలియన్ డాలర్లు సంపాదించాడు. 1976లో ఎస్కోబార్ అరెస్టైనా 1980లో అత్యంత ధనవంతుడు అయ్యాడు. 1982లో కొలంబియా పార్లమెంట్ కు ఎంపీగా వెళ్లాడు. అమెరికా అరెస్టు చేయాలని చూస్తే నాటి కొలంబియా ప్రెసిడెంట్ తో మాట్లాడుకుని సొంత జైలు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటానని తప్పించుని పోయాడు. తర్వాత లా మినిస్టర్ ను చంపేశాడు. 1985లో సుప్రీం కోర్టుపై దాడి చేసి 11 మంది జడ్జిలను తగలబెట్టారు. ఆ తర్వాత ఎన్నో దురాగతాలకు పాల్పడ్డారు. అంబానీ, టాటా కంటె ఎక్కువ డబ్బులు సంపాదించాలనేది జగన్ కోరిక. రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా, నీతిగా చేయాలి. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్- 2047 విజన్ ప్రకారం నెంబర్ -1 లేదా నెంబర్ 2 గా ఉంటుంది.’’ అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
నేను శాశ్వతం కాదు…రాష్ట్రం శాశ్వతం
నేను ముఖ్యం కాదు…ప్రజలు ముఖ్యం…నేను శాశ్వతం కాదు…రాష్ట్రం శాశ్వతం. నన్నూ, మిమ్మల్నీ ఇబ్బంది పెట్టారు. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు. పోలీసు శాఖలో మార్పు తీసుకొస్తాం. కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పిస్తాం. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటాం. గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తాం. నేరస్థుల్లో భయం రావాలి. శాంతి భద్రతలు పరిరక్షించడం ఎంత ముఖ్యమో వివరిస్తాం. మదనపల్లిలో 2 వేల ఫైళ్లు తగలెబట్టారు. వాళ్లు చేసిన ఘోరాల నుండి తప్పించుకోవడానికి తప్పుడు పనులు చేస్తున్నారు. తన, మన అనే బేధం లేకుండా శాంతి భద్రతలు కాపాడతాం. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.