ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
ఆదివారం ఆయన రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా, కార్యక్రమ ప్రత్యేక అధికారులు ప్రద్యుమ్న, బాబు ఏ, వీర పాండ్యన్, వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్, రాష్ట్ర అదనపు డీజీపి బాగ్చి, ఐ.జీ.లు రాజశేఖర్ బాబు, అశోక్ కుమార్, పోలీస్ కమిషనర్ రామకృష్ణ, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయీం అస్మిలతో కలిసి గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని ఐటీ పార్కు మేధా టవర్స్ సమీపంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు.
తొలుత వారు మేధా టవర్స్ సమీపంలో ఎంపిక చేసిన సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారన్నారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
ప్రధాన సభాస్థలి వెనుక భాగంలోని గుంటలను పూడ్చి వీఐపీలు వచ్చేందుకు వీలుగా చదును చేసే పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. వేదిక వద్ద, బారికేడింగ్, బ్లాక్ ల విభజన, వంటి ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా సభ ప్రాంగణంతో పాటు వెలుపల ఎంపిక చేసిన ప్రదేశాలలో ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం ఆయన ఆ రోజు కార్యక్రమానికి విచ్చేయు ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సాధారణ పౌరులకు వివిధ ప్రదేశాలలో ఎంపిక చేసిన పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.
గన్నవరం జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంక్, ఎన్టీఆర్ ప్రభుత్వ పశు వైద్య కళాశాల, కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలు, ఎలిట్ విస్టాస్, మేధా టవర్స్, ఇతర లేఔట్లలో ఎంపిక చేసిన పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.
పార్కింగ్ ప్రదేశాల నుండి ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను నిర్మించి, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ క్రమంలో ఎలీట్ విస్టాస్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులకు పార్కింగ్ స్థలాన్ని వారు ఎంపిక చేశారు. అక్కడ నుండి వారు సభాస్థలికి చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారిని ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేకమైన వస్త్రాలతో సుందరీకరించాలన్నారు.
ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన సభ వేదిక వద్దకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా బారికేడ్ ఏర్పాటు చేయాలని, అప్రోచ్ రహదారిని సక్రమంగా నిర్మించాలని సూచించారు.
కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుంటూ అప్పగించిన పనులను పూర్తిచేయాలని, నిత్యం పర్యవేక్షించాలని సూచించారు.
ఈ పర్యటనలో కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు గీతాంజలి శర్మ, జి రాజ కుమారి, విజయవాడ, రాజమండ్రి మునిసిపల్ కమిషనర్లు స్వప్నిల్ దినకర్, దినేష్ కుమార్, డిఐజి గోపీనాథ్ జెట్టి, విజయవాడ డిసిపి అధిరాజ్ ఎస్. రానా, గుడివాడ ఆర్డిఓ పి పద్మావతి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.