మార్కెట్లో రూ. 2 లక్షలు ధర ఉండే బైక్‌ను రూ. లక్షకే అమ్మేస్తున్నారు. రూ. 10 లక్షల వాహనాన్ని రూ. 5 లక్షలకే సొంతం చేసుకోండంటూ ఆఫర్స్ ఇస్తున్నారు. అయితే ఈ ఆఫర్స్ ఏ బైక్ లేదా కార్ల షోరూమ్‍లో కాదు.. ఇదంతా ఓ దొంగల ముఠా పని. ఇప్పుడా ముఠా ఆచూకీని అనంతపురం పోలీసులు కనుగొన్నారు. ఫైనాన్స్ కంపెనీలకు నకిలీ పత్రాలు సమర్పించి, ఆయా వాహనాలను పక్క రాష్ట్రాల్లో అమ్ముతున్న గుట్టు రట్టు చేశారు. ఆ గ్యాంగ్ లోని ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసు అధికారులు.
అసలేం జరిగిందంటే?
మార్కెట్‌లోని ప్రముఖ వాహన ఫైనాన్స్ సంస్థలను మోసం చేసి కొత్త వాహనాలను ఎత్తుకుపోయే ముఠా మోసాన్ని అనంతపురం జిల్లా పోలీసులు గుర్తించారు. ఆ జిల్లా ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుతో విచారణ చేయగా ఈ వ్యవహరం బయటపడింది. స్థానికంగా ఉండే ఓ ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదుతో ఈ విచిత్ర మోసం నిగ్గు తేల్చారు. వారం రోజులుగా ఈ దందా పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. నకిలీ ఆధార్ సహా ఇతర పత్రాలతో వాహన ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకుని వివిధ కంపెనీలకు చెందిన వాహనాలను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఒకరి ఫోటోతో వేరొకరి ఆధార్ నెంబర్, ఇంకొకరి అడ్రస్‍లను కలిపి నకిలీ ఆధార్ కార్డు సృష్టించి వాహనాలు కొంటున్నారు. అలా కొనుగోలు చేసిన వాటిని జనాలకు అమ్మేందుకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను ఈ ముఠా నియమించుకుంది.
ఆ విధంగా డాక్యుమెంట్స్ లేకుండా వాహనాలను కొనుగోలు చేయాలనే కండీషన్ పెట్టి.. సగం ధరకే విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. అయితే వాటిని కొనే వాళ్లు కూడా సంబంధిత పత్రాలు లేకున్నా.. తక్కువ ధరకి విక్రయిస్తున్న కారణంగా ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదే అదునుగా ఈ దొంగల ముఠా రూ. కోట్ల దందా చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
పక్కా ప్లాన్‌తో వస్తారు..లేపేస్తారు..!!
వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి వాయిదా పద్ధతితో వాహనాలు కొనుగోలు చేస్తున్న ముఠా వాటిని సగం ధరకే అమ్మేస్తున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన ద్విచక్రవాహనాలతో పాటు సరకు రవాణా ఆటోలను పక్క జిల్లాలకు తరలించి అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాకి చెందిన ఒక్క ఏజెంట్.. తాడిపత్రిలో ఏకంగా 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారం.
దీనిపై అతడ్ని విచారించగా ఒక్కరోజులోనే 72 కొత్త వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండిపై పది వేల రూపాయల లాభం వేసుకుని ఏజంట్లు సగం ధరకే విక్రయిస్తున్నారు. విక్రయం తర్వాత సదరు ఫైనాన్స్ కంపెనీలకు 2 లేదా 3 నెలల వాయిదా చెల్లించి కనిపించకుండా పోతున్నారు. వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవటం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోతోంది.
అయితే తమ వద్ద కొన్న వాహనాలకు పేపర్లు ఉండవని రిజిస్ట్రేషన్ చేసుకోడానికి వీలుండదని ఏజెంట్లు ముందుగానే చెప్పేస్తున్నారు. సగం ధరకే కొత్త వాహనం వస్తుందన్న ఆనందంతో కొనుగోలుదారుడు ఆసక్తి చూపుతున్నారు. ఎవరైనా అడిగినప్పుడు చూద్దాంలే అని తేలిగ్గా తీసుకుంటున్నారు. విషయం జిల్లా ఎస్పీ దృష్టికి రావటం వల్ల పోలీసులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి రహస్యంగా దర్యాప్తు చేయిస్తున్నారు. అంతర్రాష్ట్ర స్థాయిలో ఈ రాకెట్ ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం.