ఏపీ రాజధాని అమరావతి రాజధాని అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం పెద్ద స్థాయిలో భూసేకరణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 44,676 ఎకరాల భూసమీకరణను చేపట్టేందుకు సీఆర్డీయే చర్యలు ప్రారంభించింది. తూళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ ప్రక్రియ జరగనుంది.
తూళ్లూరు మండలంలో హరిచంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో 9,919 ఎకరాలు, అమరావతి మండలంలోని వైకుంఠపురం, ఎండ్రాయి, కార్లపూడి, మొత్తడాక, నిడముక్కల గ్రామాల్లో 12,838 ఎకరాల భూములు భూసమీకరణకు నిర్ణయించారు.
తాడికొండ మండలంలోని తాడికొండ, కంతేరు గ్రామాల్లో 16,463 ఎకరాలు, మంగళగిరిలోని కాజా గ్రామంలో 4,492 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందుకోసం త్వరలోనే ఆయా గ్రామాల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే అమరావతిలోని 29 గ్రామాల నుంచి 34 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయే సేకరించింది. తాజా భూసేకరణతో రాజధాని విస్తరణ మరింత వేగంగా జరుగుతుంది.
ఈ భూములు ప్రధానంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ మధ్య విస్తరించి ఉంటాయి. ఎయిర్‌పోర్ట్, రోడ్డు నెట్‌వర్క్, అలాగే ఎర్రుపాలెం నుండి అమరావతి వరకూ ప్రతిపాదిత రైల్వే లైన్ కోసం ఈ భూములను వినియోగించనున్నారు.