Amaravati Farmers Plots : రాజధాని నిర్మాణం కోసం పచ్చని పొలాలను త్యాగం చేసిన అన్నదాతల ఆవేదనకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఏళ్ల తరబడి వారిని వేధిస్తున్న ‘వీధి పోట్ల’ సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. తమకు కేటాయించిన ప్లాట్లకు వాస్తు దోషం ఉందనో, చిన్న రోడ్డు నుంచి పెద్ద రోడ్డుకు మారుతున్నామనో ఆందోళన చెందుతున్న రైతులకు సీఆర్డీఏ (CRDA) తీపి కబురు చెప్పింది. త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు వాస్తుకు అనుగుణంగా కొత్త ప్లాట్లను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
‘వీధి పోట్ల’ చిక్కుముడి వీడిందిలా : రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు గతంలో కేటాయించిన కొన్ని ప్లాట్లు వాస్తు రీత్యా సరిగా లేవని, వీధి పోట్లు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాన వెడల్పు లేని రోడ్ల వల్ల తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచనల మేరకు, ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయని, మ్యూటేషన్ కాని 112 సమస్యాత్మక ప్లాట్లను అధికారులు గుర్తించారు. ఇప్పుడు వాటికి బదులుగా, వాస్తు ప్రకారం సరైన ప్రదేశాల్లో వేరే ప్లాట్లను కేటాయించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
ఉండవల్లి రైతులకు ఈ-లాటరీ : రాజధానిలోని సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికి భూములిచ్చిన ఉండవల్లి గ్రామానికి చెందిన 16 మంది రైతులకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ప్లాట్ల కేటాయింపు జరిగింది.
పారదర్శకంగా కేటాయింపు: ఈ-లాటరీ విధానం ద్వారా 21 రిటర్నబుల్ ప్లాట్లను అధికారులు కేటాయించారు.
సర్టిఫికెట్ల అందజేత: లాటరీలో ప్లాట్లు దక్కించుకున్న రైతులకు సీఆర్డీఏ అధికారులు అక్కడికక్కడే ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు.
రిజిస్ట్రేషన్: ప్లాట్లు పొందిన రైతులు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, ఇందుకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని అధికారులు స్పష్టం చేశారు.
వడివడిగా రాజధాని పనులు: మంత్రి నారాయణ : మరోవైపు, రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనుల వేగం పుంజుకుంది. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, వెంకటపాలెం గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. రైతుల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి నారాయణ కీలక విషయాలు వెల్లడించారు.
రూ.48 వేల కోట్లతో పనులు: అమరావతి నిర్మాణానికి భారీ ఎత్తున టెండర్లు పిలిచామని, 350 కి.మీల మేర ట్రంక్ రోడ్లు, 1500 కి.మీల లేఅవుట్ రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ఏప్రిల్ నాటికి ఇళ్లు: ఉద్యోగులు, అధికారుల కోసం నిర్మిస్తున్న 3,500 ఇళ్ల నిర్మాణం ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని మంత్రి హామీ ఇచ్చారు.
వర్షాకాలం టార్గెట్: రాజధానిలోని 29 గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, వర్షాకాలం వచ్చేలోపు అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
గతంలోనూ భారీగా కేటాయింపులు : కొద్దిరోజుల క్రితమే తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన 195 మంది రైతులకు ఈ-లాటరీ ద్వారా 381 నివాస, వాణిజ్య ప్లాట్లను సీఆర్డీఏ కేటాయించింది. ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించారు. అయితే, కొందరు రైతులు తమ భూమికి దూరంగా ప్లాట్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేయగా, వారి సమస్యలను కూడా పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.

