Tuesday, April 22, 2025
HomeAP జిల్లా వార్తలుఅమరావతిఏపీలో మండిపోతున్న ఎండలు.. కీలక ప్రకటన చేసిన హోం మంత్రి అనిత..!

ఏపీలో మండిపోతున్న ఎండలు.. కీలక ప్రకటన చేసిన హోం మంత్రి అనిత..!

తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు ఉద్ధృతంగా కొనిసాగుతున్న నేపథ్యంలో, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఏపీలో వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె అధికారులతో కీలక సూచనలు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వడగాల్పులు, రాబోయే వర్షాకాలం కోసం అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతూ, కాలుష్య భయంతో పాటు వేడిగాలుల ప్రమాదాన్ని తట్టుకునేందుకు ప్రజలకు సరైన సమాచారం అందించాలని సూచించారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయని, ఏప్రిల్ 2025లో పల్నాడు జిల్లాలో 43.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. గత సంవత్సరాల్లోనూ 49 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఇందులో భాగంగా తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, పట్టణాల్లో ప్రజలకు నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని సీడీఎంఏ డైరెక్టర్ సంపత్ వెల్లడించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వల కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ఏర్పాటు, 92 మండలాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. పాఠశాలల్లో తాగునీటి సరఫరాతో పాటు మజ్జిగ పంపిణీకి ఎన్‌జీవోల సహకారం తీసుకుంటామని వెల్లడించారు.

వడదెబ్బ చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా 5,145 పడకలు, 768 అంబులెన్సులు సిద్ధం చేశామని, వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని వైద్యశాఖ తెలిపింది. ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రధాన నగరాల్లో వడగాల్పులపై అప్రమత్తత చర్యలతో కూడిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఉష్ణోగ్రతలు మించి పోతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. ఎండకు గురికావొద్దని, శరీరాన్ని తడిగా ఉంచుతూ మజ్జిగ, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. వడదెబ్బతో ప్రాణాలు పోకుండా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News