Amaravati : హైదరాబాద్‌లో ప్రఖ్యాతి గాంచిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూమిపూజను బుధవారం ఉదయం తుళ్లూరు సమీపంలో సంస్థ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘనంగా నిర్వహించారు.
ALSO READ: https://teluguprabha.net/news/basavatarakam-cancer-hospital-amaravati-groundbreaking/
21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ క్యాంపస్ సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధన, రోగుల సంరక్షణ కోసం ఎక్స్‌లెన్సీ సెంటర్‌గా ఉంటుంది. తొలి దశలో రూ.750 కోట్ల పెట్టుబడితో 500 పడకల సామర్థ్యంతో ఆధునిక ఆంకాలజీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అధునాతన పరికరాలు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స కోసం ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌ను అనుసరిస్తారు. 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభమవుతాయి.
రెండో దశలో పడకల సామర్థ్యం 1000కి పెంచి, ప్రత్యేక విభాగాలు, అధునాతన పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ క్యాంపస్ క్లిష్టమైన క్యాన్సర్ కేసులకు ప్రాంతీయ రిఫరల్ కేంద్రంగా మారనుంది. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను మరింత మెరుగుపరచడంతో పాటు, రోగులకు అందుబాటు ధరల్లో అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది.
బాలకృష్ణ మాట్లాడుతూ, “ఈ క్యాంపస్ క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి ఆశాకిరణంగా నిలుస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో సమగ్ర చికిత్స అందించడమే మా లక్ష్యం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు, స్థానిక నాయకులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.


