Chandrababu Naidu On GST 2.0: వచ్చే పదేళ్లలో మహారాష్ట్ర, యూపీలను అధిగమించి ఆంధ్రప్రదేశ్ నెం. 1 కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. జీఎస్టీ సంస్కరణలపై అసెంబ్లీలో మాట్లాడిన అనంతరం వ్యవసాయ రంగంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆదాయం వచ్చే పంటలను వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని సీఎం అన్నారు. వచ్చే ఐదేళ్లలో హార్టికల్చర్‌ను 25 లక్షల హెక్టార్లకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
‘రాష్ట్రానికి 41 శాతం ఆదాయం సేవారంగం నుంచి వస్తుంది. పశు సంపదపై 19 లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయి. పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి మరింత పెరగాల్సిన అవసరం ఉంది. స్వయం సహాయక సంఘాల మహిళ ఆదాయం పెరుగుతోంది. 157 గోకులాలు త్వరలో రానున్నాయి. పశువులకు హాస్టళ్లను ఏర్పాటు చేయడంతో పాటు గోకులాలకు కూడా గడ్డి సరఫరా చేస్తున్నాం’. అని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని సీఎం అన్నారు. రాయలసీమలో హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్‌ను తీసుకురావాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. ఇప్పటికే హార్టికల్చర్‌లో 21 శాతం వృద్ధి రేటు సాధించామని.. ఆ రంగం అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని వెల్లడించారు. వాటితో పాటు రాష్ట్రంలో అరటి, మిరప, మామిడి, పూలు, టొమాటో, బత్తాయి, ఆయిల్‌పామ్, మిరియాలు, నిమ్మ సాగును ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. మరో పదేళ్లలో మహారాష్ట్ర, యూపీని అధిగమించి ఆంధ్రప్రదేశ్ నెం. 1 కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/supreme-court-gives-green-signal-for-organizing-utsav/
అంతకుముందు జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడిన సీఎం.. రాబోయే రోజుల్లో జీఎస్టీ గేమ్ ఛేంజర్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. పేదల జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని.. మేడిన్ ఇండియా మరింతగా బలోపేతం అవుతుందన్నారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని పేర్కొన్న ఆయన.. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ ఉత్సవాలు నిర్వహిస్తామని వివరించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రతి ఇంటికీ తెలిసేలా ప్రచారం నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు.


