Cm Fire On Kurnool Bus Accident : కర్నూలు జిల్లా NH-44లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ వోల్వో బస్సు చిన్నటేకూరు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ దెబ్బతో ఇంధన ట్యాంక్ పేలి మంటలు చెలరేగి, 41 మంది ప్రయాణికుల్లో 20 మంది సజీవ దహనమైనారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు కాలిపోయి గుర్తించడం కష్టమవుతోంది. బైక్ డ్రైవర్ కూడా మరణించాడు.
ALSO READ: Kavitha New Party Update : కొత్త పార్టీపై కవిత హింట్! వాళ్లు చెప్తే చేస్తుందట!
ఈ దుర్ఘటనపై చంద్రబాబు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. “ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే సహించేది లేదు. నిర్లక్ష్యమే కారణమని తేలితే కఠిన చర్యలు తప్పవు” అని ట్రావెల్స్ యాజమాన్యాలకు హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, పీఎం మోదీ రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం, మృతుల వివరాలు త్వరగా గుర్తించి సహాయం అందించాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ బస్సుల ఫిట్‌నెస్, సేఫ్టీ, పర్మిట్‌లపై తక్షణ తనిఖీలు చేపట్టాలని రవాణా శాఖకు సూచించారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక పరిస్థితి పరిశీలించాలని స్పష్టం చేశారు. ప్రమాద బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, పర్మిట్ వివరాలతో పూర్తి నివేదిక సమర్పించాలని కోరారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మృతుల కుటుంబాలకు త్వరగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రమాద స్థలానికి ఫైర్ టెండర్లు, 108 ఆంబులెన్స్‌లు చేరి రక్షణ చర్యలు చేపట్టాయి. మంటలు అదుపులోకి రావడానికి కొంత సమయం పట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్, కండక్టర్‌లు క్షతగాత్రులు. ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ దుర్ఘటన రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రభుత్వం బస్సుల ఇన్స్పెక్షన్లు, డ్రైవర్ల ట్రైనింగ్ మెరుగుపరచాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘాటించింది.


